నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Showing posts with label అన్నమయ్య అధ్యాత్మ సంకీర్తనలు. Show all posts
Showing posts with label అన్నమయ్య అధ్యాత్మ సంకీర్తనలు. Show all posts

Jun 1, 2011

అరుదైన భవదూరుఁడగు నీతఁడు

నా బ్లాగు మిత్రులందరికీ నా బ్లాగుకి నా పునరాగమన సందర్భంలో శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇంతకాలం బ్లాగుకు దూరంగా ఉన్నాను. కాని ఈ రోజెందుకో బ్లాగు ద్వారా మిమ్మల్నందఱినీ పలకరించా లనిపించింది. ఈ బ్లాగులో అన్నమాచార్యులవారి దశావతారాల సంకీర్తన నొకదానిని మీ అందరితో పంచుకోవాలనిపించి ఈ ప్రయత్నం.

20 రేకు లలిత(అవతారాలు)
అరుదైన భవదూరుఁడగు నీతఁడు
అరిది భవములందునతఁడు వో యితఁడు II పల్లవి II

కొడుకుటెక్కెమురూపు కోరి కైకొని పెద్ద
కొడుకు కొరకుఁగా గోరపడి
కొడుకువైరి భక్తిఁ గూడిన యాతని
నడవిలోఁ జంపిన యతఁడు వో యితఁడు IIఅరుII మత్స్యావతారము?

ఆలితమ్ముని రాకకలరి మెచ్చెడిచోట
ఆలుఁ దానును నుండి యందులోన
ఆలిచంటికింద నడ్డమువడుకున్న
ఆలవాలమువంటి అతఁడు వో యితఁడు IIఅరుII కూర్మావతారము?

సవతి తమ్ముఁడు గోవుఁ జంపఁ బట్టుక పోయి
సవతి తమ్మునియింట సడిఁబెట్టఁగా
సవతులేనిపంటఁ జప్పరించివేసి
ఆవల యివల సేసి నతఁడు వో యితఁడు IIఅరుII వరాహావతారము?

తొడ జనించిన యింతి దొరకొనాపద సేయ(?)
దొలఁ (డ?)గి తోలాడెడి దొడ్డవాని
తొడమీఁద నిడి వానికడుపులో తొడవులే
యడియాలమగు మేని యతఁడు వో యితఁడు IIఅరుII నరసింహావతారము?

పదము దానొసఁగుచుఁ బదమడుగగఁ బోయి
పదము వదము మోవఁ బరగఁ జేసి
పదముననె దివ్యపదమిచ్చి మనుమని
నదిమి కాచినయట్టి అతఁడు వో యితఁడు IIఅరుII వామనావతారము

అత్తకొడుకుపేరి యాతనిఁ దనకూర్మి
యత్తయింటిలోన నధికుఁ జేసి
మత్తిల్లు తనతోడ మలసిన యాతని
నత్తలిత్తల సేసినతఁడు వో యితఁడు. IIఅరుII పరశురామావతారము?

పాముతోడుతఁ బోరి పంతముగొనువాని
పాముకుఁ బ్రాణమై పరగువాని
ప్రేమపుఁ దనయుని బిరుదుగా నేలిన
ఆమాటనిజముల అతఁడు వో యితఁడు. IIఅరుII కృష్ణావతారము?

ఎత్తుక వురవడినేఁగెడి దనుజుని
యెత్తుకలుగు మద మిగుర మోఁది
మత్తిల్లు చదువుల మౌనిఁ జం..........
అత్తలేని యల్లుఁడతఁడు వో యితఁడు. IIఅరుII రామావతారము

బిగిసి మేఁకమెడ పిసికెడి మాటలు
పగలుగాఁగ రేయివగలు సేసి
జగములోన నెల్ల జాటుచుఁ బెద్దల
అగడుసేయఁ బుట్టినతఁడు వో యితఁడు. IIఅరుII బలరామావతారము?

మెట్టనిచోట్ల మెట్టుచుఁ బరువులు
పెట్టెడిరాయ....................
కట్టెడికాలము కడపట నదయుల(?)
నట్టులాడించిన అతఁడు వో యితఁడు. IIఅరుII కల్క్యావతారము

తలఁకకిన్నియు జేసి తనుఁగాని యాతని
వలెనె నేఁడు వచ్చి వసుధలోన
వెలుఁగొంది వేంకటవిభుఁడై వెలసిన
యలవిగాని విభుఁడతఁడు వో యితఁడు. IIఅరుII వేంటేశ్వరస్వామి 4-8 ( నిడురేకులలోని 77 సంకీర్తలలో 8వ సంకీర్తన యిది)
ఇది దశావతారాల కీర్తన. అందుచేత మనం వరుసగా మత్స్య, కూర్మ, వరాహ, వామన, నారసింహ, పరశురామ,బలరామ, రామ,కృష్ణ, కల్క్యావతారాలు గుర్తులో ఉంచుకుని ఈ కీర్తనని అర్థం చేసుకొనే ప్రయత్నం చేయాలి. అన్నమయ్య మన తెలివితేటలకి జ్ఞాపకశక్తికి పరీక్ష పెట్టినట్లుగా ఉన్నది ఈ సంకీర్తన. నాకు అర్థం పూర్తిగా తెలియటం లేదు. ఎవరైనా పెద్దలు గాని, పిన్నలుగానీ ఈ సమస్యను విపులీకరించి నాకు సుబోధకమయ్యేలా విడమరిచి చెప్తే వారికి నేను కృతజ్ఞుడనై ఉంటాను.
అత్తలేని అల్లుడు అంటే రామావతారము అనుకొన్నాను.సీతాదేవి అయోనిజ కాబట్టి. పదమడుగబోయి అంటే వామనావతారము బలిని దానమడిగిన విధానం మూడు అడుగులు( పదములు) కాబట్టి.కట్టెడి కాలము కడపట అంటే చివరలో వచ్చే కల్క్యావతార మనిపించింది.

0 comments

Jun 3, 2010

అదె వచ్చె నిదె వచ్చె నచ్యుతు సేనాపతి

సాళంగనాట
అదె వచ్చె నిదె వచ్చె నచ్యుతు సేనాపతి
పదిదిక్కులకు నిట్టె పారరో యసురలు IIపల్లవిII

గరుడధ్వజం బదె ఘనశంఖరవ మదె
సరుసనే విష్ణుదేవుచక్ర మదె
మురవైరిపంపు లవె ముందరి సేన లవె
పరచి గగ్గులకాడై పారరో దానవులు. IIఅదెII

తెల్లని గొడుగు లవె దేవదుందుభులు నవె
యెల్ల దేవతల రథా లింతటా నవె
కెల్లు రేఁగీ నిక్కి హరికీర్తి భుజము లవె
పల్లపు పాతాళానఁ బడరో దనుజులు. IIఅదెII

వెండి పైఁడిగుదె లవె వింజామరము లవె
మెండగు కై వారాలు మించిన వవె
దండి శ్రీ వేంకటపతి దాడిముట్టె నదె యిదె
బండుబండై జజ్జరించి పారరో దైతేయులు. IIఅదెII 2-70

0 comments

May 25, 2010

సందడి విడువుము సాసముఖా

ధన్నాసి
సందడి విడువుము సాసముఖా
మంధర ధరునకు మజ్జన వేళా                IIపల్లవిII

అమరాధిపు లిడుఁ డాలవట్టములు
కమలజ పట్టుము కాళాంజి
జమిలి చామరలు చంద్రుఁడ సూర్యుఁడ
అమర నిడుఁడు పరమాత్మునకు.             IIసందII

అణిమాదిసిరుల నలరెడు శేషుఁడ
మణిపాదుక లిడు మతి చెలఁగా
ప్రణుతింపు కదిసి భారతీరమణ
గుణాధిపు మరుగురు బలుమరును.         IIసందII

వేద ఘోషణము విడువక సేయుఁడు
ఆదిమునులు నిత్యాధికులు
శ్రీ దేవుండగు శ్రీ వేంకటపతి
ఆదరమున సిరు లందీ వాఁడె.                IIసందII 1-12


కాళాంజి = తమ్మపడిగము, పతద్గ్రాహము ( పిల్లి అంటే బిడాలము అన్నట్టుంది కదూ)

1 comments

Apr 14, 2010

శ్రీ అన్నమాచార్య సంకీర్తనా గానం

విజయవాడ శ్రీ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగబోయే శ్రీ అన్నమాచార్య సంకీర్తనా  గానం 

5 వ నంబరు గుంపు వారిచే గానం చేయబడు సంకీర్తనలు - వాటి వివరములు.
మొదటి సంకీర్తన - నానాటి బతుకు


    నానాటి బతుకు నాటకము
    కానక కన్నది కైవల్యము IIపల్లవిII

    పుట్టుటయు నిజము పోవుటయు నిజము
    నట్టనడిమి పని నాటకము
    యెట్ట నెదుట కల దీ ప్రపంచము
    కట్ట కడపటిది కైవల్యము. IIనానాII


    కుడిచే దన్నము కోక చుట్టెడిది
    నడు మంత్రపు పని నాటకము
    వొడి గట్టుకొనిన వుభయ కర్మములు
    గడి దాటినపుడే కైవల్యము. II నానా II


    తెగదు పాపము తీరదు పుణ్యము
    నగి నగి కాలము నాటకము
    యెగువనె శ్రీ వేంకటేశ్వరు డేలిక
    గగనము మీదిది కైవల్యము. IIనానాII


    రెండవ సంకీర్తన - మర్ద మర్ద మమ బంధాని
    నాట


    మర్ద మర్ద మమ బంధాని
    దుర్దాంత మహాదురితాని IIపల్లవిII


    చక్రాయుధ రవిశతతేజోంచిత
    సక్రోధ సహస్ర ప్రముఖా
    విక్రమక్రమా విస్ఫులింగకణ
    నక్రహరణ హరినవ్యకరాంకా. II మర్దII


    కలితసుదర్శన కఠిన విదారణ
    కులిశ కోటిభవ ఘోషణా
    ప్రళయానల సంభ్రమవిభ్రమకర
    రళితదైత్యగళరక్తవికీరణా. II మర్ద II


    హితకర శ్రీ వేంకటేశ ప్రయుక్త
    సతత పరాక్రమజయంకర
    చతురో2హం తే శరణం గతో2స్మి
    యితరాన్ విభజ్య యిహ మాం రక్ష. II మర్ద II2-81


    మూడవ సంకీర్తన - రామ రామ రామకృష్ణ

    రామ రామ రామకృష్ణ రాజీవలోచన నీకు
    దీము వంటి బంటననే తేజమే నాది II పల్లవిII


    వారధి దాటి మెప్పించ వాయుజుడ నే గాను
    సారె చవుల మెప్పించ శబరి గాను
    బీరాన సీత నిచ్చి మెప్పించ జనకుండ గాను
    ఏ రీతి మెప్పింతు నన్నెట్లా గాచేవో. II రామ II



    ఘనమై మోవి మెప్పించ గరుడుడ నే గాను
    కొన కామ సుఖమిచ్చు గోపిక గాను
    వినుతించి మెప్పించ వేయినోళ్ళ భోగి గాను
    నిన్నెట్లు మెప్పించు నన్ను గాచే దెట్లా. II రామ II


    నవ్వుచు పాడి మెప్పించ నారదుడ నే గాను
    అవ్వల ప్రాణమీయ జటాయువు గాను
    ఇవ్వల శ్రీ వేంకటేశ యిటునీకె శరణంటి
    అవ్వల నా తెరువిదే రక్షించే దెట్లా. II రామ II


    నాల్గవ సంకీర్తనవాఁడె వేంకటేశుఁడనే వాఁడే వీఁడు (భూపాళం పుస్తకం లోనిది) పాడాల్సినది (రసికరంజని)
     
     
     
    వాఁడె వేంకటేశుఁడనే వాఁడె వీఁడు
    వాఁడి చుట్టుఁ గైదువవలచేతివాఁడు II పల్లవిII

    కారిమారసుతునిచక్కనిమాటలకుఁ జొక్కి 
    చూరగా వేదాలగుట్టు చూపినవాఁడు
    తీరని వేడుకతో తిరుమంగయాళువారి-
    ఆరడిముచ్చిమికూటి కాసపడ్డవాఁడు II వాఁడె II

    పెరియాళువారిబిడ్డ పిసికి పై వేసిన-
    విరులదండల మెడవేసినవాఁడు
    తరుణి చేయివేసిన దగ్గరి బుజము చాఁచి 
    పరవశమై చొక్కి పాయలేనివాఁడు II వాఁడె II

    పామరులఁ దనమీఁది పాటలెల్లాఁ బాడుమంటా
    భూమికెల్లా నోర నూరిఁపోసినవాఁడు
    మామ కూఁతురల మేలుమంగనాచారియుఁ దాను
    గీముగానే వేంకటగిరి నుండేవాఁడు. II వాఁడె II



    ఐదవ సంకీర్తన - ఎదుట నున్నాడు వీడె
    ఎదుట నున్నాడు వీడె ఈ బాలుడు
    మది తెలియమమ్మ ఏ మరులో కాని II పల్లవి II


    పరమ పురుషుడట పసుల గాచెనట
    సరవులెంచిన విన సంగతాయిది
    పరియె తానట ముద్దులందరికి జేసెనట
    ఇరవాయనమ్మ సుద్దులేటివో గాని II ఎదుట II


    వేదాల కొడయడట వెన్నలు దొంగిలెనట
    నాదించి విన్నవారికి నమ్మికా యిది
    ఆదిమూల మీతడట ఆడికెల చాతలట
    కాదమ్మ ఈ సుద్దులెట్టికతలో కాని II ఎదుట II


    అల బ్రహ్మ తండ్రియట యశోదకు బిడ్డడట
    కొలదొకరికి చెప్పకూడునా యిది
    తెలిసి శ్రీ వేంకటాద్రి దేవుడై నిలిచెనట
    కలదమ్మ తనకెంతో కరుణో కాని II ఎదుట II 




    ఆఱవ సంకీర్తన - జయ జయ రామ
    జయ జయ రామ సమర విజయ రామ
    భయహర నిజ భక్త పారీణ రామా II పల్లవి II


    జలధి బంధించిన సౌమిత్రి రామా
    సెలవిల్లు విరచిన సీతారామా
    అల సుగ్రీవు నేలిన అయోధ్య రామా
    కలిగి యజ్ఞము కాచె కౌసల్య రామా II జయ II


    అరి రావణాంతక ఆదిత్యకుల రామా
    గురు మౌనులను గాచే కోదండ రామా 
    ధర నహల్య పాలిటి దశరథ రామా
    హరురాణి నుతుల లోకాభి రామా II జయ II


    అతి ప్రతాపముల మాయామృగాంతక రామా
    సుత కుశలవ ప్రియ సుగుణ రామా
    వితత మహిమల శ్రీవేంకటాద్రి రామా
    మతిలోన బాయని మనువంశ రామా II జయ II



    ఏడవ సంకీర్తన - వెనకేదో ముందరేదో

    వెనకేదో ముందరేదో వెర్ఱి నేను, నా
    మనసు మరులు దేర మందే దొకో II పల్లవి II

    చేరి మీదటి జన్మము సిరులకు నోమేగాని
    ఏ రూపై పుట్టుదునో ఎఱగ నేను
    కోరి నిద్రించ పరచుకొన నుద్యోగింతు కాని
    సారె లేతునో లేవనో జాడ తెలియ ( నేను ) II వెన II

    తెల్లవారినపుడెల్లా తెలిసితి ననేకాని
    కల్ల యోదొ నిజమేదో కాన నేను
    వల్ల చూచి కామినుల వలపించే గాని
    మొల్లమై నా మేను ముదిసిన దెఱగ II వెన II
    పాపాలుచేసి మరచి బ్రదుకు చున్నాడగాని
    వైపుగ చిత్రగుప్తుడు వ్రాయుటెఱగ
    ఏపున శ్రీవేంకటేశు నెక్కడో వెదకేగాని
    నాపాలి దైవమని నన్నుగాచు టెరగ II వెనII

    8 వ సంకీర్తన - రామచంద్రు డితడు
    రామచంద్రుడితడు రఘువీరుడు
    కామిత ఫలము లియ్యగలిగె నిందరికి II పల్లవిII
    గౌతము భార్యపాలిటి కామధేను వితడు
    ఘాతల కౌశికుపాలిటి కల్పవృక్షము
    సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు
    ఈతడు దాసులపాలిటి ఇహపర దైవము II రామ II

    పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు
    సరి హనుమంతు పాలి సామ్రాజ్యము
    నిరతి విభీషణు పాలి నిధానము ఈతడు
    గరిమ జనకు పాలి ఘనపారిజాతము. II రామ II

    తలప శబరి పాలి తత్త్వపు రహస్యము
    అలరి గుహుని పాలి ఆదిమూలము
    కలడన్న వారి పాలి కన్ను లెదుటి మూరితి
    వెలయ శ్రీ వేంకటాద్రి విభు డితడూ. II రామ II

     9 వ సంకీర్తన - ఆదిదేవ పరమాత్మా
    దేవగాంధారి ( పుస్తకములో నున్నది) పాడవలసినది (సింధు భైరవి )

    ఆదిదేవ పరమాతుమా
    వేదవేదాంతవేద్య నమో నమో II పల్లవి II
    పరాత్పరా భక్త భవభంజనా 
    చరాచరలోకజనక నమో నమో II ఆది II
    గదాధరా వేంకటగిరినిలయా
    సదానంద ప్రసన్న నమో నమో II ఆది II


    10 వ సంకీర్తన - శరణు శరణు 
    శరణు శరణు సురేంద్ర సన్నుత
    శరణు శ్రీ సతి వల్లభ
    శరణు రాక్షస గర్వ సంహర
    శరణు వేంకటనాయకా ii శరణు ii

    కమలధరుడును కమల మిత్రుడు 
    కమల శత్రుడు పుత్రుడు
    క్రమముతో మీ కొలువుకిప్పుడు
    కాచినా రెచ్చరికయా ii శరణు ii

    అనిమిషేంద్రులు మునులుదిక్పతు
    లమర కిన్నర సిద్ధులు
    ఘనతతో రంభాదికాంతలు
    కాచినా రెచ్చరికయా ii శరణు ii

    ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు 
    నిన్ను కొలువగ వచ్చిరి
    విన్నపము వినవయ్య తిరుపతి
    వేంకటాచల నాయకా. ii శరణు ii






     
     
     





































    5 comments

    Jan 14, 2010

    వినరయ్య నరసింహవిజయము జనులాల

    నాట

    వినరయ్య నరసింహవిజయము జనులాల
    అనిశము సంపదలు నాయువు నొసఁగును . IIపల్లవిII

    మొదలఁ గొలువుకూటమున నుండి కశిపుఁడు
    చదివించెఁ బ్రహ్లాదుని శాస్త్రములు
    అదన నాతఁడు నారాయణుఁడే దైవమనె
    అదిరిపడి దైత్యుఁడు ఆతనిఁ జూపుమనె .    IIవినరII

    అంతటఁ బ్రహ్లాదుఁడు ' అన్నిటానున్నాఁ ' డనియె
    పంతమున దానవుఁడు బాలునిఁ జూచి
    యెంతయుఁ గడఁకతోడ ' ఇందులోఁ జూపు ' మని
    చెంతనున్న కంబము చేతఁగొని వేసె .     IIవినరII


    అటమీఁదట బ్రహ్మాండం బదరుచు
    కుటిలభయంకరఘోషముతో
    చిట చిట చిటమని పెట పెట పెటమని
    పటపట మనుచును బగిలెఁ గంబము .    IIవినరII



    కులగిరు లదరెను కుంభిని వడఁకెను
    తలఁకిరి దైత్యులు తల్లడిలి
    కలఁగెను జగములు కంపించె జగములు
    ప్రళయకాలగతిఁ బాటిల్లె నపుడు .    IIవినరII


    ఘననారసింహుఁ డదె కంబమునందు వెడలె
    కనుపట్టె నదిగొ చక్రజ్వాలలు
    మునుకొని వెడలెఁ గార్ముకముక్తశరములు
    కనకకశిపునకుఁ గలఁగె గుండియలు .   IIవినరII



    అడరె నద్దేవునికోపాగ్నులు బెడిదపు -
    మిడుఁగురులతోడుత మిన్నులుముట్టి
    పిడుగులురాలేటిభీకరనఖరములు
    గడుసు రక్కసునికి గాలములై తగిలె .    IIవినరII



    తొడికి పట్టి విష్ణుఁడు తొడమీఁద నిడుకొని
    కడుపు చించెను వానిగర్వమడఁగ
    వెడలెఁ జిల్లున వానివేఁడి నెత్తురు నింగికి
    పొడి వొడియాయ శత్రుభూషణములెల్లను .   IIవినరII



    నెళ నెళన విరిచె నిక్క వానియెముకలు
    పెళపెళ నారిచి పెచ్చు వెరిగె హరి
    జళిపించి పేగులు జంద్యాలుగా వేసుకొనె
    తళుకుఁగోరలు తళతళమని మెరిచె .     IIవినరII



    పెటలించి నరములు పెరికి కుప్పలువేసి
    గుటగుటమని రొప్పె గోవిందుఁడు
    చిటిలించి కండలు చెక్కలు వారఁజెండి
    కుటిలదానవుఁ జూచి ' ఖో ' యని యార్చెను .   IIవినరII



    తెంచి శిరోజములు దిక్కులకు వాని -
    పంచప్రాణములుగొనెఁ బరమాత్ముఁడు
    అంచెల నీరీతిని ప్రహ్లాదునిపగ నీఁగె
    మించి దేవతలు మితిమీఱి జయవెట్టిరి .    IIవినరII



    అప్పు డిందిరాదేవి యంకమునఁ గూచుండె
    వొప్పుగ శాంతమందె నహోబలేశుఁడు
    తప్పక కోనేటిదండఁ దానై యిందును నందు
    చిప్పిల వరములిచ్చీ శ్రీవేంకటేశుఁడు . II వినర II 4-513




    0 comments

    Sep 15, 2009

    తొల్లి కలవే ఇవియు తొల్లి తానుఁ గలడే కల్లయునుఁ గాదు ఇది కడు నిజము గాదు.





       పాడి
    తొల్లి కలవే ఇవియు తొల్లి తానుఁ గలడే
    కల్లయునుఁ గాదు ఇది కడు నిజము గాదు.     IIపల్లవిII

    కను దెరచినంతనే  కలుగు నీ జగము
    కనుమూసినంతనే కడు శూన్యమౌను
    కనురెప్ప మరఁగుననె కలిమియును లేమియును
    తన మనోభావనలఁ దగిలి తోఁచీని.           IIతొల్లిII

    తలఁచినంతనె యెంత దవ్వయిన గాన్పించు
    తలఁపు మరచినమతికి దట్టమౌఁ దమము
    పొలసి మతిమరఁగుననె పుట్టుటలుఁ బోవుటలు
    పలుచంచలవికారభావ మీ గుణము.      IIతొల్లిII

    ముందు దాఁ గలిగితే మూఁడు లోకములుఁ గల
    వెందు దా లేకుంటే నేమియును లేదు 
    అంది శ్రీవేంకటేశుఁ డాత్మలోననె వీఁడె
    కందువల నితని సంకల్ప మీపనులు.     IIతొల్లిII
    4-73

    3 comments

    Aug 13, 2009

    అడర శ్రావణబహుళాష్టమి నేఁ డితఁడు నడురేయి జనియించినాఁడు చూడఁగదరే.

    కృష్ణాష్టమి సందర్భంగా బ్లాగ్మిత్రులందరికీ నా శుభాకాంక్షలు
    రామక్రియ
    అడర శ్రావణబహుళాష్టమి నేఁ డితఁడు
    నడురేయి జనియించినాఁడు చూడఁగదరే. IIపల్లవిII

    గొంతిదేవిమేనల్లుఁడు గోపసతులమగఁడు
    పంతపుపాండవులకు బావమరఁది
    వంతుతో వసుదేవదేవకులకుమారుఁడు
    ఇంతటికృష్ణుఁడు జనియించినాఁడుగదరే. IIఅడరII

    బలరామునితమ్ముఁడు పంచసాయకునితండ్రి
    మలసి మేటైనయభిమన్యునిమామ
    లలి సాత్యకిసుభద్రలకుఁ దోబుట్టినయన్న
    ఇలపైఁ గృష్ణుఁడు జనియించినాఁడుగదరే. IIఅడరII

    శూరసేనుమనుమఁ డచ్చుగ ననిరుద్దుతాత
    పౌరవయాదవలోకబాంధవుఁడు
    అరయ శ్రీవేంకటేశుఁ డలమేల్మంగకుఁ బతి
    యీరీతిఁ గృష్ణుఁడు జనియించినాఁడుగదరే. IIఅడరII ౪-౧౬౦

    1 comments

    శ్రావణబహుళాష్టమి జయంతి నేఁడు సేవించరో నరులాల శ్రీకృష్ణుఁడితఁడు.

    శ్రావణబహుళాష్టమి(కృష్ణ జయంతి) సందర్భంగా బ్లాగ్మిత్రులందరికీ నా శుభాకాంక్షలు.
    సాళంగనాట
    శ్రావణబహుళాష్టమి జయంతి నేఁడు
    సేవించరో నరులాల శ్రీకృష్ణుఁడితఁడు. IIపల్లవిII

    భావింప వసుదేవునిపాలిటిభాగ్యదేవత
    దేవకిగనినయట్టి దివ్యరత్నము
    చేవమీర సురలరక్షించేకల్పతరువు
    యీవేళ జన్మించినాఁడు యిదె కృష్ణుఁడు. IIశ్రావణII

    హరవిరంచాదులకు నాదిమూలకారణము
    పరమమునులతపఃఫలసారము
    గరుడోరగేంద్రులకుఁ గలిగిన నిధానము
    యిరవుగా నుదయించె నిదె కృష్ణుఁడు. IIశ్రావణII

    బలు యోగీశ్వరుల బ్రహ్మానందము
    చెలఁగుభాగవతులచింతామణి
    అలమేల్మంగకుఁ బతి యట్టె శ్రీవేంకటాద్రి-
    నిలపై జన్మించినాఁడు యిదె కృష్ణుఁడు. IIశ్రావణII ౪-౧౩౯

    0 comments

    Aug 5, 2009

    ఇంతకంటే నేమి సేసే మిదే మా మానసపూజ

    శంకరాభరణం
    ఇంతకంటే నేమి సేసే మిదే మా మానసపూజ
    సంతతము నీవు తొల్లే సర్వసంపన్నుఁడవు. IIపల్లవిII

    అంతర్యామివైనమీకు నావాహన మదివో
    అంతటా విష్ణుఁడ మీకు నాసనము వేసినది
    పంతపుఁ కోనేరే మీకుఁ బలుమారు నర్ఘ్యము
    చెంతనే గంగాజలముచల్లేమీకుఁ బాద్యము. IIఇంతII

    జలధు లన్నియును నాచమనియ్యము మీకు
    అల యా వరుణజల మిదియే స్నానము
    పలనుగా మీమహిమలే వస్త్రాభరణములు
    అల వేదములే మీకు యజ్ఞోపవీతములు. IIఇంతII

    ఇరవుగఁ గుబ్జ తొల్లిచ్చినదే మీకు గంధము
    ధర మాలాకారునిపూదండలే మీకు పువ్వులు
    ఉరుగతి మౌనులహోమమే మీకు ధూపము
    తిరమైన మీకు రవితేజమే దీపము. IIఇంతII ౨-౨౭౨

    పై పాటలో పంచదశోపచారాలే ఉన్నాయి. నీరాజనము తప్పిపోయినది.

    0 comments

    Apr 3, 2009

    రామచంద్రుఁడితఁడు రఘువీరుడు

    Get this widget | Track details | eSnips Social DNA




    శ్రీరాగం
    రామచంద్రుఁడితఁడు రఘువీరుఁడు
    కామితఫలములియ్యఁ గలిగె నిందరికి. IIపల్లవిII

    గౌతముభార్యపాలిటి కామధేనువితఁడు
    ఘాతలఁ గౌశికుపాలికల్పవృక్షము
    సీతాదేవిపాలిటిచింతామ ణీతఁడు
    యీతఁడు దాసులపాలియిహపరదైవము. IIరామII


    పరగ సుగ్రీవుపాలిపరమబంధుఁ డీతఁడు
    సరి హనుమంతుపాలిసామ్రాజ్యము
    నిరతి విభీషణునిపాలినిధానము( నీతడు)
    గరిమ జనకుపాలిఘనపారిజాతము. IIరామII

    తలఁప శబరిపాలితత్వపురహస్యము
    అలరి గుహునిపాలిఆదిమూలము
    కలఁడన్నవారిపాలికన్ను లెదుటిమూరితి
    వెలయ శ్రీవేంకటాద్రివిభుఁ డీతఁడు. IIరామII ౪-౧౪౭

    2 comments

    Mar 29, 2009

    వెగ్గల మింతా వృథా వృథా


    నాగవరాళి
    వెగ్గల మింతా వృథా వృథా
    తగ్గి పరులతో దైన్యములేలా. IIపల్లవిII

    పెంచఁగఁబెంచఁగఁ బెరగీ నాసలు
    తుంచఁగఁదుంచఁగఁ దొలఁగు నవి
    కంచము కూడును కట్టిన కోకయు
    వంచనమేనికి వలసినదింతే. IIవెగ్గలII

    తడవఁగఁదడవఁగఁ దగిలీ బంధము
    విడువఁగ విడువఁగ వీడునవి(ది?)
    గుడిశలోన నొకకుక్కిమంచమున
    వొడలు సగమునను వుండెడిదింతే. IIవెగ్గలII

    మరవఁగమరవఁగ మాయలే యింతా
    మురహరుఁదలచితే మోక్షము
    నిరతి శ్రీవేంకటనిలయుఁడే కాయపు-
    గరిమెల నిలిచిన కాణా చింతే. IIవెగ్గలII4-౨౪౨

    1 comments

    Mar 6, 2009

    ఉన్నచోనే మూఁడులోకా లూహించి చూచితే నీవే

    శంకరాభరణం
    ఉన్నచోనే మూఁడులోకా లూహించి చూచితే నీవే
    కన్నచోటనే వెదకి కానఁ డింతేకాక. IIపల్లవిII

    యెక్కడ వొయ్యెడి జీవుఁ డేది వైకుంఠము
    యిక్కడ హరి యున్నాఁ డు హృదయమందె
    ముక్కున నూరుపు మోచి ముంచి పుణ్యపాపాల-
    కక్కసానఁ జిక్కి తమ్ముఁ గానఁ డింతేకాక. IIఉన్నII

    యేమి విచారించి దేహి యెందు దేవుని వెదకీ
    కామించి యాతఁ డిన్నిటాఁ గలిగుండఁగా
    దోమటిసంసారపుదొంతికర్మములఁ జిక్కి
    కాముకుడై కిందుమీఁదు గాన డింతేకాక. IIఉన్నII

    యే విధులు తాఁ జేసీ యెవ్వరి నాడఁగఁబోయీ
    శ్రీవేంకటేశ్వరుసేవ చేతనుండఁగా
    భావ మాతఁడుగాను బ్రతికె నిదివో నేఁడు
    కావరాన నిన్నాళు కానఁ డింతేకాక. IIఉన్నII ౩-౭౮

    0 comments

    Mar 3, 2009

    అన్నియు నాయందే కంటి నన్నిటివాఁడా నేనే

    మాళవి
    అన్నియు నాయందే కంటి నన్నిటివాఁడా నేనే
    మున్నె నాభావముతో ముడిచివేసినది. IIపల్లవిII

    చెలఁగి సంసారమే చింతించి సంసారినైతి
    ములిగి ముక్తిదలఁచి ముక్తుఁడనైతి
    పలుమతాలు దలఁచి పాషండబుద్ధినైతి
    చెలఁగి శ్రీపతిఁ దలఁచి వైష్ణవుఁడనైతి. IIఅన్నిII

    పొసఁగ బుణ్యముసేసి పుణ్యాత్ముఁడనైతి
    పసలఁ బాపముచేసి పాపకర్ముఁడనైతి
    వెస బ్రహ్మచారినైతి వేరె యాచారమున
    మునిపి మరొకాచారమున సన్యాసినైతి. IIఅన్నిII

    వొగి నొడ్డెభాషలాడి వొడ్డెవాఁడనైతిని
    తెగి తెలుఁగాడ నేర్చి తెలుఁగువాడనైతి
    అగడై శ్రీవేంకటేశ అన్నియు విడిచి నేను
    తగు నీదాసుడనై దాసరి నే నైతి. IIఅన్నిII ౩-౩౭౯

    0 comments

    Feb 14, 2009

    పరుస మొక్క టేకాదా పయిఁడిగాఁ జేసేది

    సామంతం
    పరుస మొక్క టేకాదా పయిఁడిగాఁ జేసేది
    అరయ లోహమెట్టున్నా నందుకేమీ. IIపల్లవిII

    వనజనాభునిభక్తి వదలకుండినఁ జాలు
    మనసు యెందు దిరిగినా మరియేమి

    మొనసి ముద్రలు భుజముల నుండితేఁ జాలు

    తనువెంతహేయమైనా దానికేమి. IIపరుసII


    శ్రీ కాంతునామము జిహ్వఁ దగిలితే జాలు

    యేకులజుఁడైనాను హీనమేమి

    సాకారుఁడై నహరి శరణుచొచ్చినఁ జాలు

    చేకొని పాపము లెన్ని చేసిననేమి. IIపరుసII


    జీవుఁ డెట్టున్నా నేమి జీవునిలో యంతరాత్మ
    శ్రీ వెంకటేశున కాచింతయేమి

    యేవలనఁ బరమైన యిహమైన మాకుఁ జాలు

    కై వశమాయ నతఁడు కడమలింకేమీ. IIపరుసII౧-౩౭౩

    2 comments

    సడిఁబెట్టెఁ గటకటా సంసారము చూడ

    భైరవి
    సడిఁబెట్టెఁ గటకటా సంసారము చూడ-
    జడధిలోపలియీఁత సంసారము. IIపల్లవిII

    జమునోరిలో బ్రదుకు సంసారము చూడ-
    చమురుదీసినదివ్వె సంసారము
    సమయించుఁబెనుదెవులు సంసారము చూడ
    సమరంబులో నునికి సంసారము. IIసడిII

    సందిగట్టినతాడు సంసారము చూడ
    సందికంతలలోని సంసారము
    చందురినిజీవనము సంసారము
    చంద మేవలెనుండు సంసారము. IIసడిII

    చలువలోపలివేఁడి సంసారము చూడ
    జలపూఁతబంగారు సంసారము
    యిలలోనఁ దిరువేంకటేశ నీదాసులకు
    చలువలకుఁ గడుఁజలువ సంసారము. IIసడిII౧౯౯

    0 comments

    Feb 11, 2009

    ఎదుట నెవ్వరు లేరు యింతా విష్ణుమయమే

    Get this widget | Track details | eSnips Social DNA

    పాడి
    ఎదుట నెవ్వరు లేరు యింతా విష్ణుమయమే
    వదలక హరిదాసవర్గమైనవారికి. IIపల్లవిII

    ముంచిన నారాయణమూర్తులే యీజగమెల్ల
    అంచిత నామములే యీ యక్షరాలెల్లా
    పంచుకొన్న శ్రీహరిప్రసాద మీరుచులెల్లా
    తెంచి వేసి మేలు దాఁ దెలిసేటివారికి. IIఎదుII

    చేరి పారేటి నదులు శ్రీపాదతీర్థమే
    భారపు యీ భూమెతనిపాదరేణువే
    సారపుఁగర్మములు కేశవుని కైంకర్యములే
    ధీరులై వివేకించి తెలిసేటివారికి. IIఎదుII

    చిత్తములో భావమెల్లా శ్రీవేంకటేశుఁడే
    హత్తిన ప్రకృతి యెల్లా నాతనిమాయే
    మత్తిలి యీతనికంటే మరి లే దితరములు
    తిత్తి దేహపుబ్రదుకు తెలిసేటివారికి. IIఎదుII౧-౫౦౨

    0 comments

    ఎంతని నుతియింతు రామరామ యిట్టి నీప్రతాపము రామరామ


    Get this widget | Track details | eSnips Social DNA
    దేవగాంధారి
    ఎంతని నుతియింతు రామరామ యిట్టి నీప్రతాపము రామరామ
    పంతాన సముద్రము రామరామ బంధించవచ్చునా రామరామ. IIపల్లవిII

    బలుసంజీవనికొండ రామరామ బంటుచేఁ దెప్పించితివి రామరామ
    కొలఁదిలేనివాలిని రామరామ ఒక్కకోల నేసితివట రామరామ
    వెలయ నెక్కువెట్టి రామరామ హరువిల్లు విరిచితివట రామరామ
    పెలుచు భూమిజను రామరామ పెండ్లాడితివట రామరామ. IIఎంతనిII

    శరణంటే విభీషణుని రామరామ చయ్యనఁ గాచితివట రామరామ
    బిరుదుల రావణుని రామరామ పీఁచమడఁచితివట రామరామ
    ధరలోఁ జక్రవాళము రామరామ దాఁటి వచ్చితివఁట రామరామ
    సురలు నుతించిరట రామరామ నీ చొప్పు యిఁక నదియెంతో రామరామ. IIఎంతనిII

    సౌమిత్రి భరతులు రామరామ శత్రుఘ్నులుఁ(డుఁ?) దమ్ములట రామరామ
    నీ మహత్త్వము రామరామ నిండె జగములెల్లా రామరామ
    శ్రీమంతుఁడ వన్నిటాను రామరామ శ్రీవేంకటగిరిమీఁది రామరామ
    కామిత ఫలదుడవు రామరామ కౌసల్యానందనుఁడవు రామరామ. IIఎంతనిII

    రామరామ అనే సంకీర్తనం మాటిమాటికీ వచ్చేలా చేసిన సంకీర్తనం -ఎంతో సుందరం-ఎంతో సుమధురం.

    0 comments

    ఇన్నిటికి నోపునా యీ మనసు నన్ను

    సాళంగనాట
    ఇన్నిటికి నోపునా యీ మనసు నన్ను
    మన్నించి నీ మనసు మరిగించుమనసు. IIపల్లవిII

    పొలఁతులకాఁకనే పుటమెక్కె మనసు
    చలివేఁడిజవ్వనమునందిఁ జిక్కె మనసు
    వలరాజుతూపునంజు వడినెక్కె మనసు
    మలసి రతిసుఖాలమరపాయ మనసు. IIఇన్నిII

    పచ్చనికనకముపై భ్రమఁబడె మనసు
    చిచ్చువంటి విషయాల శివమెత్తె మనసు
    వొచ్చెపుఁ బాపాలకెల్లా నొడిగట్టె మనసు
    బచ్చన చెంచెలములఁ బాటిచెడి మనసు. IIఇన్నిII

    కోరి యంతలో గురుఁడు గూఁటవేసె మనసు
    వోరుపుతో నీపాలి కొప్పగించె మనసు
    ఈగీతి శ్రీవేంకటేశుఁడ నామనసు
    తోరపు విజ్ఞానము తుదకెక్కె మనసు. IIఇన్నిII౪-౩౩౫

    0 comments

    Feb 9, 2009

    విచ్చనవిడినీ యాడీ వీఁడె కృష్ణుఁడు

    దేవక్రియ
    విచ్చనవిడినీ యాడీ వీఁడె కృష్ణుఁడు
    వొచ్చెములేనివాఁడు వుద్దగిరికృష్ణుఁడు IIపల్లవిII


    గల్లుగల్లుమనఁగాను గజ్జలు నందెలతోడ

    బిల్లఁగోట్లా
    డీని పిన్నకృష్ణుఁడు
    కెల్లురేఁగి వీధులనుఁ గేరి
    పుట్టచెండులాడీ
    బల్లిదుఁడు గదవమ్మ బాలకృష్ణుఁడు. IIవిచ్చII


    తమితోడ గోపాలులు తానుఁ గూడి ముంగిటను
    సముద్రబిల్ల
    లాడీ సాధుకృష్ణుడు
    చెమటలుగార
    సిరిసింగనవత్తి యాడీ
    గుమితాన వీఁడే యమ్మా గోపాలకృష్ణుఁడు. IIవిచ్చII


    వుదుటునఁ బారి పారి వుడ్డగచ్చకాయలాడీ
    ముదముదొలఁకఁగాను ముద్దుకృష్ణుఁడు

    అదివో శ్రీవేంకటేశుఁ
    డాటలెల్లాఁ దానే యాడీ
    పదివేలు చందాల శ్రీపతియైన కృష్ణుఁడు. IIవిచ్చII
    ౪-౧౭౨

    ఈ మధ్య బ్లాగులలో ఒకరిద్దరు పెద్దలు వారి వారి చిన్ననాటి ఆటలను గుర్తుచేసుకొని వారి పిల్లలు ఈ రోజుల్లో కంప్యూటర్ల మీదనే ఎక్కువకాలం గడపాల్సిరావటం గురించి తలచుకొని- ఆ యా ఆటపాటలను బ్లాగులలో వ్రాద్దామనుకోవటం చూసి ఈ కీర్తనను పోస్టు చేసాను. అన్నమయ్య గారి కాలంలో నున్న కొన్ని ఆటలు ఇందులో ఉన్నాయి. బిల్లంగోరు, పుట్టచెండ్లు, సముద్రబిల్లలు, సిరిసింగనావత్తి, వుడ్డగచ్చకాయ -ఈ ఆటలలో బిల్లంగోరు ఆట తప్ప మిగిలిన అటల గురించి నాకూ ఏమీ తెలియదు. హంసవింశతిలో ఇంకా కొన్ని ఆటలను పేర్కోవటం జరిగింది. ఈ ఆటలను ఏ విధంగా ఆడతారో తెలుసుకోవాలని ఉంది. తెలిసిన వారెవరైనా చెప్తారేమోననే చిన్న ఆశ. తీరుతుందనే అనిపిస్తున్నది.

    0 comments

    Feb 8, 2009

    నా 200వ పోస్టు--తక్కిన చదువు లొల్ల తప్పనొల్లా

    ఈ ప్రచురణ నా నరసింహ బ్లాగులో 200వ ప్రచురణ. ఈ సందర్భంగా బ్లాగ్మిత్రులందరికీ నా శుభాకాంక్షలు. నా బ్లాగును ఆదరంతో వీక్షిస్తున్న మిత్రులందరికీ ఈ బ్లాగు మూలంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు .
    దేసాళం
    తక్కిన చదువు లొల్ల తప్పనొల్లా
    చక్కఁగ శ్రీహరి నీ శరణే చాలు. IIపల్లవిII

    మోపులు మోవఁగ నొల్ల ములుగఁగ నొల్ల
    తీపు నంజనొల్ల చేఁదు దినఁగ నొల్ల
    పాపపుణ్యాలవి యొల్ల భవమునఁ బుట్టనొల్ల
    శ్రీపతినే నిరతము చింతించుటే చాలు. IIతక్కిII

    వడిగా బరువు లొల్ల వగరింప నేనొల్ల
    వెడఁగు జీఁకటి యొల్ల వెలుఁగూ నొల్ల
    యిడుముల వేఁడనొల్ల యెక్కువ భోగము లొల్ల
    తడయక హరి నీ దాస్యమే చాలు. IIతక్కిII

    అట్టె పథ్యము లొల్ల అవుషధము గొననొల్ల
    మట్టులేని మణుఁగొల్ల మైల గానొల్ల
    యిట్టె శ్రీవేంకటేశు నిరవుగ సేవించి
    చుట్టుకొన్న యానందసుఖమే చాలు. IIతక్కిII ౪-౬౫

    మనమందరం ఆ శ్రీహరినే శరణు వేడుదాం. ఆయనే మనందరికీ దిక్కూ మొక్కూ కూడా.

    0 comments

    ధర్మో రక్షతి రక్షితః

    ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

    విషయసూచిక

    నాకిష్టమైనవి

    ప్రస్తుత వీక్షకులు

    నా ప్రపంచం

    అతిథి దేవో భవః

    స్వపరిచయం

     
    నరసింహ - Template By Blogger Clicks