నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Showing posts with label అన్నమయ్య శృంగార సంకీర్తనలు. Show all posts
Showing posts with label అన్నమయ్య శృంగార సంకీర్తనలు. Show all posts

Jun 2, 2010

పరమపురుషుఁడు గోపాలబాలుఁ డైనాఁడు

లలిత పరమపురుషుఁడు గోపాలబాలుఁ డైనాఁడు మురహరుఁడు యెదుట ముద్దుగారీ నిదివో II పల్లవిII   వేదపురాణములలో విహరించే దేవుఁడు ఆదిమూలమైనట్టి అలబ్రహ్మము   శ్రీదేవిపాలిటఁ జెలఁగే నిధానము   సేద దేరి యశోదకు శిశు వాయ నిదివో. IIపరమII   మొక్కేటి నారదాదుల ముందరి సాకారము  అక్కజపు జీవులలో అంతర్యామి      గక్కన బ్రహ్మఁ గొడుకుఁగాఁ గన్న పరమము        అక్కరతో వెన్నముచ్చై యాటలాడీ నిదివో. IIపరమII        దేవతలఁ గాచుటకు దిక్కయిన విష్ణుఁడు      భావము లొక్కరూపైన భావతత్త్వము    శ్రీ వేంకటాద్రిమీఁద జేరున్న యా వరదుఁడు      కై వసమై గొల్లెతల కాఁగిళ్ళ నిదివో. IIపరమII 12- 17







     Get this widget |     Track details  |

0 comments

Jun 1, 2010

వలచి వచ్చితి నేను వానికిఁ గాను

దేసాళం
వలచి వచ్చితి నేను వానికిఁ గాను
నెలవై మీ గొల్ల వాడనే తానుండు న(ంటా)టా IIపల్లవిII

చెందమ్మికన్నులవాఁడు చేతిపిల్లఁ గోవివాఁడు
యిందు వచ్చెఁ గంటిరా యేమిరే యమ్మా
మందలపసువులవాఁడు మకరాంకములవాఁడు
యెందు నున్నాఁడు చెప్పరే యేల దాఁచేరమ్మా IIవలచిII

నెమలిపించెమువాఁడు నీలమేఘకాంతివాఁడు
రమణుఁ డాతఁడు, మొక్కే రమ్మనరమ్మా
జమళి చేతులవాఁడు సంకుఁజక్రములవాఁడు
అమర మీపాలఁ జిక్కునట చూపరమ్మా. IIవలచిII 

పచ్చఁబైడిదట్టివాఁడు పక్షివాహనపువాఁడు
యిచ్చినాఁడు నా కుంగర మిదివో యమ్మా
చెచ్చెరఁ గొనేటివాఁడు శ్రీ వేంకటేశ్వరుఁడు
వచ్చి నన్నుఁ గూడినాఁడు వాఁడువో యమ్మా. IIవలచిII 18-14
 

1 comments

May 21, 2010

సారెకు నంటకురే జడనందురు

శంకరాభరణం
సారెకు నంటకురే జడనందురు
ధీరుఁడాతఁడున్నతపు దేహియట     IIపల్లవిII

బాయిటఁ బెట్టకురే పక్షులు పారెడిపొద్దు
వోయమ్మ బాలులకు నొప్పదందురు
మాయపుఁ బులుగొకటి మచ్చికనీ బాలుని
చేయిచ్చి యెక్కించుకొనఁ జేరీనట.     IIసారెII

పంచలఁ దిప్పకురే పాములు వెళ్ళేటి పొద్దు
కొంచెపుబాలులఁ బై కొనునందురు
మించిన పామొకటి మెరసి యీ బాలుని
దించక యెక్కించుకొనఁ దిరిగీనట.     IIసారెII

అలమి పట్టకురే అంటఁ గాకుండెడివారు
తొలరమ్మ బాలులకు దోసమందురు
కలికి యీ తిరువేంకటపతిఁ గదిసిన
చెలఁగి వేగమే చీరచిక్కీనట.             IIసారెII
5-247

0 comments

May 20, 2010

రాధామాధవరతిచరితమితి

రీతిగౌళ

రాధామాధవరతిచరితమితి
బోధావహం శ్రుతిభూషణం          IIపల్లవిII

గహనే ద్వావసి గత్వా గత్వా
రహసి రతిం ప్రేరయతి సతి
విహరత స్తదా విలసంతౌ
విహత గృహాశౌ వివశౌ తౌ .                    IIరాధాII

లజ్జాశబళ విలాసలీలయా
కజ్జలనయన వికారేణ
హృజ్జావ్యవహృత (హిత?) హృదయా రతి
స్సజ్జా సంభ్రమచపలా జాతా.         IIరాధాII

పురతో యాంతం పురుషం వకుళైః
కురంటకైర్వా కుటజై ర్వా
పరమం ప్రహరతి పశ్చాల్లగ్నా
గిరం వినాపి వికిరతి ముదం.           IIరాధాII

హరి సురభూరుహ మర్హతివస్వ -( మారోహతీవ ?)
చరణేన కటిం సంవేష్ట్య
పరిరంభణ సంపాదిత పులకై -
స్సురుచిర్జాతా సుమలతికేవ.           IIరాధాII

విధుముఖదర్శన విగళతిలజ్జా -
త్వధరబింబఫలమాస్వాద్య
మధురోపాయనమార్గేణ కుచౌ
నిధివద (ద్ద?) త్వా నిత్యసుఖమితా.       IIరాధాII

సురుచిరకేతక సుమదళ నఖరై -
ర్వరచిబుకం సా పరివృత్య (వర్త్య?)
తరుణిమసింధౌ తదీయదృగ్జల -
చరయుగళం సంస్తకం చకార .               IIరాధాII

వచన విలాసైర్వశీకృత (త్య?) తం
నిచులకుంజ మానితదేశే
ప్రచురసైకతే పల్లవశయనే
రచితరతికళా రాగేణాస.                         IIరాధాII

అభినవకల్యాణాంచిత రూపా -
వభినివేశ సంయతచిత్తౌ
బభూవతు స్తత్పరౌ వేంకట -
విభుణా (నా?) సా తద్విధినా సతయా.        IIరాధాII

సచ లజ్జావీక్షణో భవతి తం
కచభరం (ర?) గంధం ఘ్రాపయతి
నచలతిచేన్మానవతీ తథాపి
కుచసంగాదనుకూలయతి.                         IIరాధాII

అవనత శిరసాప్యతి సుభగం
వివిధాలా పైర్వివశయతి
ప్రవిమల కరరుహరచన విలాసై -
ర్భువనపతి(తిం?) తం భూషయతి.                IIరాధాII

లతాగృహమేళనం నవసై -
కతవై భవ సౌఖ్యం దృష్ట్వా
తత స్తతశ్చరసౌ (శ్చరతస్తౌ?) కేలీ -
వ్రతచర్యాం తాం వాంఛంతౌ.                          IIరాధాII

వనకుసుమ విశదపరవాసనయా
ఘనసారరజోగంధైశ్చ
జనయతి పవనే సపది వికారం
వనితా పురుషౌ జనితాశౌ.                             IIరాధాII

ఏవం విచరన్ హేలా విముఖ -
శ్శ్రీ వేంకటగిరి దేవోయం
పావనరాధా పరిరంభసుఖ -
శ్రీ వైభవసుస్థిరో భవతి.                                IIరాధాII 5-166

0 comments

Apr 26, 2010

ముద్దులు మోమున ముంచఁగను

 
ముద్దులు మోమున ముంచఁగను
నిద్దపు కూరిమి నించీని II పల్లవిII

మొల చిరుఘంటలు మువ్వలు గజ్జలు
ఘలఘలమనఁగాఁ గదలఁగను
ఎలనవ్వులతో నీతఁడు వచ్చి
జలజపుచేతులు చాఁచీని IIముద్దుII

అచ్చపుఁ గుచ్చుముత్యాల హారములు
పచ్చల చంద్రాభరణములు
తచ్చిన చేతుల తానె దైవమని
అచ్చట నిచ్చట నాడీని IIముద్దుII

బాలుఁడు కృష్ణుఁడు పరమపురుషుఁడు
నేలకు నింగికి నెరిఁబొడవై
చాలించి ( చాల ?) వేంకటాచలపతి దానై
మేలిమి సేఁతల మించీని. IIముద్దుII  5-303
 

 
                           

0 comments

Jun 9, 2009

కూరిములే కదవమ్మ కోపమయ్యీని కడు-

కాంభోది
కూరిములే కదవమ్మ కోపమయ్యీని కడు-
భారమైన పోటుగాదా పచ్చిదేరే పలుకు. IIపల్లవిII

పున్నమచందురుని తోఁబుట్టుగైన నీమోము-
వెన్నెలలే కదవమ్మ వేఁచఁజొచ్చీని
పన్నిన పగల వెలుపటివారికంటెను
ఎన్న రాని పగగాదా యింటిలోనిపోరు. IIకూరిII

చిత్తజుని జనియించఁ జేసే మొక్కలపు నీ-
చిత్తమిదే కదవమ్మ సిగ్గు వాపీని
మిత్తివలెఁ జెలరేఁగి మీఁదఁ గాసే యెండకంటే
నెత్తిమీఁది చిచ్చుగాదా నీడలోని యెండ. IIకూరిII

కట్టఁగడ చందనపుగాలికి మీరిన నీ-
నిట్టూరుపులేకావా నిగ్గుదేరీని
యిట్టె యివె తిరువేంకటేశుఁగూడఁబట్టి నీకు
చుట్టపుఁబగలే మంచిచుట్టములై నవి. IIకూరిII 5-199

0 comments

Jun 7, 2009

అబ్బురంపు శిశువు ఆకుమీఁదిశిశువు

Get this widget | Track details | eSnips Social DNA


మంగళకౌశిక
అబ్బురంపు శిశువు ఆకుమీఁదిశిశువు
దొబ్బుడు రోలశిశువు త్ప్రువి త్ప్రువి త్ప్రువి. IIపల్లవిII

పుట్టు శంఖుచక్రములఁ బుట్టిన యాశిశువు
పుట్టక తోల్లే మారుపుట్టు వైన శిశువు
వొట్టుక పాలువెన్నలు నోలలాడు శిశువు
తొట్టెలలోని శిశువు త్ప్రువి త్ప్రువి త్ప్రువి. IIఅబ్బుII

నిండిన బండి దన్నిన చిన్ని శిశువు
అండవారిమదమెల్ల నణఁచిన శిశువు
కొండలంతేశసురులఁ గొట్టిన యా శిశువు
దుండగంపు శిశువు త్ప్రువి త్ప్రువి త్ప్రువి. IIఅబ్బుII

వేఁగైన వేంకటగిరి వెలసిన శిశువు
కౌఁగిటి యిందిర దొలఁగని శిశువు
ఆఁగి పాలజలధిలో నందమైన పెనుఁబాము
తూఁగుమంచము శిశువు త్ప్రువి త్ప్రువి త్ప్రువి. IIఅబ్బుII 5-220

0 comments

Jun 6, 2009

చెలియకు విరహపు వేదన చేయని సింగారంబిది

నాదరామక్రియ
చెలియకు విరహపు వేదన చేయని సింగారంబిది
సొలవక వలపుల ముద్రల చొప్పులు మాపకుఁడీ. IIపల్లవిII

కిక్కిరిసిన చనుగుబ్బలు గీఁటిన పగిలెడి నయ్యో
పక్కనఁ గనుకలి దాఁకీ బయ్యెద దెరవకుఁడీ
వెక్కసమగు ముఖకాంతికి వెడవెడ మరుఁగై తోఁచెడి
చెక్కుల చెమటలు గందెడి చేతులు వెట్టకుఁడీ. IIచెలిII

అంగన మేనికిఁ బులకలు అడ్డము దోఁచెడి నయ్యో
బంగరు మొలకలవంటివి పై పైఁ దుడువకుఁడీ
తొంగలి రెప్పల కెలఁకుల తొరిగెడి కన్నుల మెరుఁగుల
ముంగిట వేసిన చూపుల మురిపెము మానుపుఁడీ(?) IIచెలిII

తిరువేంకటపతి నింతికిఁ దెచ్చెదమనఁగా నయ్యో
కరుణించిన వాఁడాతఁడె కళవళమందకుఁడీ
తరుణీమణి మా దేవునిఁ దగఁ గౌఁగిట సౌఖ్యంబుల
పరవశమందినదేమో పలుమరుఁ బిలువకుఁడీ. IIచెలిII 5-80

2 comments

Jun 4, 2009

రావే కోడల రట్టడి కోడల

Get this widget | Track details | eSnips Social DNA


పాడి
రావే కోడల రట్టడి కోడల
పోవే పోవే అత్తయ్యా, పొందులు నీతోఁ జాలును. IIపల్లవిII

రంకెలు వేయుచు రాజులెదుట నీవు
కొంకు గొసరు లేని కోడల
పంకజముఖి నీవు పలుదొడ్డవారిండ్ల
అంకెలఁ దిరిగేవు అత్తయ్యా. IIరావేII

ఈడాడ నలుగురు నేగురు మొగలతో
కూడి సిగ్గులేని కోడల
వాడకుఁ బదుగురి వలపించుకొని నీవు
ఆడాడఁ దిరిగేవు అత్తయ్యా. IIరావేII

బొడ్డునఁ బుట్టిన పూఁపనికే నిన్ను
గొడ్డేరు తెస్తినే కోడల
గుడ్డముపయినున్న కోనేటిరాయని-
నడ్డగించుకొంటి వత్తయ్యా. IIరావేII 5-313

0 comments

Jun 3, 2009

నల్లనిమేని నగవు చూపులవాఁడు

http://www.esnips.com/doc/32d3c7cd-f515-4a30-bc6d-6a6fbcebf950/NALLANI-MENI-NAGAVU-CHOOPULA-VAADU

నాట
నల్లనిమేని నగవు చూపులవాఁడు
తెల్లని కన్నుల దేవుఁడు. IIపల్లవిII

బిరుసైన దనుజుల పీచమణఁచినట్టి-

తిరుపుఁ గై దువతోడి దేవుఁడు
చరిఁబడ్డ జగమెల్లఁ జక్కఁ జాయకుఁ దెచ్చి

తెరువు చూపినట్టి దేవుఁడు IIనల్లనిII


నీటఁ గలసినట్టి నిండిన చదువులు
తేటపరచినట్టి దేవుఁడు
పాటి మాలినట్టి ప్రాణుల దురితపు-

తీఁట వాపినట్టి దేవుఁడు. IIనల్లనిII


గురుతు వెట్టఁగరాని గుణముల నెలకొన్న-

తిరువేంకటాద్రిపై దేవుఁడు

తిరముగ ధృవునికి దివ్యపదంబిచ్చి

తెరచి రాజన్నట్టి దేవుఁడు. IIనల్లనిII 5-244

3 comments

May 29, 2009

నాకుఁ జెప్పరె వలపు నలుపో తెలుపో

శంకరాభరణం
నాకుఁ జెప్పరె వలపు నలుపో తెలుపో
నూకి పోవఁగరాదు నుయ్యో కొండో. II పల్లవిII


పొలఁతి మరునికి వెరవ పులియో యెలువో
వులుకుఁ దుమ్మిదమోఁత వురుమో మెరుమో

తిలకింపఁ జందనము తేలో పామో

యెలమిఁ గోవిలకూఁత యేదో పోదో. IIనాకుII


పొదలిన చలిగాలి పొగయో వగయో

వదలిన కన్నీరు వాఁగో వంతో
వుదరమునఁ బన్నీరు వుడుకో మిడుకో

యెదుటఁ దలవంచుకొను టెగ్గో సిగ్గో. IIనాకుII


అసమసరుపై పరపు టదనో పదనో
పసగలవానిమోవి పంచదారో తేనో
అసమగతి వానిరాక ఆదో పాదో
రసికు వేంకటేశు పొందు రాజ్యమో లక్ష్మో. IIనాకుII 5-193

0 comments

May 20, 2009

మదము దొలఁకెడి యట్టి మంచివయసున మనకు

సామంతం
మదము దొలఁకెడి యట్టి మంచివయసున మనకు
తుదలేని వేడుకలు దొరకుటెన్నఁడురా IIపల్లవిII

ఉదుటుఁ జనుదోయి నీ వురముపైఁ దనివార-
నదిమి మోమును మోము నలమి యలమి
వదలై న నీవితో వాలుఁగన్నుల జంకె-
లొదవ నీ మీఁద నొరగుటెన్నఁడురా. IIమదముII

కలికితనమునఁ నాదు కప్పురపుఁ దమ్ములము
కులికి నీ వదనమునఁ గుమ్మరించి
పలచనగు గోళ్ళ నీ పగడవాతెర నొక్కి
చెలువమగు నునుగంటి సేయు టెన్నఁడురా. IIమదముII

గరగరని కురులతో కస్తూరివాసనలు
విరితావులతోడ విసరఁగాను
తిరువేంకటాచలాధిపుఁడ నినుఁ గూడి నే-
నరమరచి సదమదము లౌట యెన్నఁడురా. IIమదముII ౫-౫౪

0 comments

Apr 25, 2009

చెల్లఁబో నీ చెప్పినట్టు సేయ నైతినా వోరి

వరాళి
చెల్లఁబో నీ చెప్పినట్టు సేయ నైతినా వోరి
కల్లతో నిజ మోపదు కల దింతే కాక. IIపల్లవిII

కోపగించుకొన నేల కోరి వేఁడుకొన నేల
యేపున నిట్టె రెండూ యెడ్డతనమే
పై పై చేఁదు దిన నేల పంచదార నంజ నేల
పూపవయసులవారి పుణ్య మింతే కాక. IIచెల్లఁబోII

అట్టె కల్ల లాడ నేల ఆనలు వెట్టుకో నేల
యెట్టివారి కైన యివి యెడ్డతనమే
మెట్టి చలిఁ బడ నేల మించి సీతు గాయ నేల
పట్టి వలచినవారి భాగ్యమింతే కాక. IIచెల్లఁబోII

చలము సాధించ నేల సారెకు వగవ నేల
యెలమితో నివి రెండు యెడ్డతనమే
పిలిచి శ్రీవేంకటేశ పెనఁగి నన్నుఁ గూడితి
పలుకుఁబంతాన నీ నా బలు వింతే కాక. IIచెల్లఁబోII ౧౧-౨౫౩

0 comments

Apr 16, 2009

సవతైనా నాపె మేలు సరి నీకంటె

శుద్ధవసంతం
సవతైనా నాపె మేలు సరి నీకంటె
అవల నాపె చెప్పినఅట్టె సేయవయ్యా. IIపల్లవిII

యేపున నన్ను మన్నించి యేమిసేయవలసిన-
నాపెనే యేకతమున నడుగవయ్యా
దాపుగ నాఁడుజాతికి దయగల దెప్పుడును
మాపుదాఁకా మగవాఁడు మత్తుఁడే యెంచఁగను. IIసవII

నేరుపున నీవు నాతో నెత్తమాడవలసిన
కోరి యాపె నొద్దఁ బెట్టుకొనవయ్యా
ఆరితేరినాఁడువారి కాఁడువారే తోడునీడ
గారవపుమగవాఁడు కపటే యెపుడు. IIసవII

శ్రీవేంకటేశ్వర నన్నుఁ జేకొని కూడితి విట్టె
యేవేళ నలమేల్మంగ కియ్యకోలయ్యా
కైవశమై ఆఁడువారు కనిపించేయట్టివారు
వావులనే మగవారు వంతువా సెఱఁగరు. IIసవII ౨౦-౩౨౬

అడవారి కాడవారే నమ్మదగిన తోడూ నీడా -- కాని మగవాడు కాడెంతమాత్రం కాడు.--తోటి స్త్రీ తనకు సవితె అయినా కాని మగవాడైన తన పతికంటే కూడా ఆమే మంచి నమ్మకస్తురాలని చెప్పే అరుదైన సంకీర్తన యిది.

0 comments

Apr 13, 2009

మగరూపు నాఁడురూపు మారుచుకొని రిద్దరు

వరాళి
మగరూపు నాఁడురూపు మారుచుకొని రిద్దరు
సొగి సెద్దము చూపరే చూచుకొనే రిద్దరు తామే. IIపల్లవిII

కలికి కస్తురిబొట్టు కాంతునినొసల నంటె
నిలువునామము పై పై నెలఁత కంటె
అలివేణి కొప్పు జారి ఆతని కొప్పుపై వాలె
అలరె నీతని(న్వి)సిక ఆతనిపాపటపైని. IIమగII

కుంకుమగుబ్బలపూఁతగురుతు విభుని కంటె
అంకెఁ బతిరొమ్ముబొచ్చు ఆకె కంటెను
కంకణాలగాజులచేయి ఘనునిసందిటఁ జిక్కె
అంకపుసాములచేయి ఆకెసందిఁ జిక్కెను. IIమగII

మట్టెలపాదము లవె మగిడె నాతనిమీఁద
నిట్టపాదాలు నిలిచె నందు
యిట్టె శ్రీవేంకటేశుఁ డింతిఁ గూడి పానుపుపై
పట్టపగ లిందరిని భ3మయించి రిదివో IIమగఈఈ ౨౦-౩౦౯

0 comments

Mar 9, 2009

యేలినవాఁడు తాను యే మనఁగల నేను

పాడి
యేలినవాఁడు తాను యే మనఁగల నేను
పోలించి తా నన్నూరకే పొగడీఁ గాక. IIపల్లవిII


పంత మాడ నెంతదానఁ బలుమారుఁ దనతోను

చెంతఁ దా నా చెప్పినట్టు సేసీ నని

వింతలుగా నందరితో విఱ్ఱవీఁగ నెంతదాన

కాంతుఁడు దా నిట్టే నాకుఁ గైవస మాయ నని. IIయేనిII


సేవ సేయ నెంతదాన చెలరేఁగి చెలరేఁగి

చేవమీఱ నా బత్తి చేకొనీ నని

వేవేలై న నా సుడ్డులు విన్నవించ నెంతదాన

దేవరవలెఁ దా విని తెలిసి మెచ్చీ నని. IIయేనిII


పెనగఁగ నెంతదాన ప్రియముతోఁ దనతోడ

ననుపునఁ దా నాతో నవ్వీ నని

యెనసి శ్రీవేంకటేశుఁ డే నలమేలుమంగను

పనిగొన
నెంతదాన బడిఁ దా నున్నాఁ డని. IIయేనిII౧౨-౧౧౩

0 comments

Feb 27, 2009

ఎన్ని నేరుచుకొంటివే యివీఁ గొన్ని

వరాళి
ఎన్ని నేరుచుకొంటివే యివీఁ గొన్ని
పన్నుకొన్న జాడలు పచ్చిదేరె నిపుడు. IIపల్లవిII

చెలిమైతేఁ జేటెఁడేసి చిగిరినవ్వు మూటెఁడేసి
బలిమి నెంత చల్లేవే పతి మీఁదను
వలపులు గంపెఁడేసి వాడికలు గుంపెఁడేసి
వెల(లి) పరచ వచ్చేవు నింతలే నీ సుద్దులు. IIఎన్నిII

తాలిములు మూరెఁడేసి తలఁపులు బారఁడేసి
గాలి గఁ(గం?)టు వేసేవే కమ్మటి నీవు
మేలములు బండెఁడేసి మెచ్చులైతే కుండెఁడేసి
చేలలో వెదవెట్టేవు చెల్లునే నీ చేఁతలు. IIఎన్నిII

సంగాతాలు పట్టెఁడేసి సఁణఁగులు గొట్టెఁడేసి
జంగిలేల కల(లి) పేవే సారె సారెకు
అంగవించి శ్రీవేంకటాద్రీశుఁడు నన్ను నేలె
యెంగిలి పొత్తేల కూడే వీతనితో నీవు. IIఎన్నిII౨౯-౪౩౦

0 comments

Feb 26, 2009

పట్టరాకుంటే వయసు పాఁతరఁబెట్టి దాఁచుకో

పాడి
పట్టరాకుంటే వయసు పాఁతరఁబెట్టి దాఁచుకో
ఇట్టె బట్టబయలేల యీఁదవచ్చేవే. IIపల్లవిII

కూరిమి గొసరుకొంటా కొంకొక నాపతితోడ
సారెకు నాడేవేమే జాణతనాలు
నేరుపుగలదంటాను నిండువావి సేసుకొని
పోరచి వలపులేల పొత్తు గలపేవే. IIపట్టII

బడివాయ కాతనితో పచ్చిమాఁట లాడుకొంటా
నడుమ నప్పటి నేమి నవ్వు నవ్వేవే
బెడిదపు వినయాలు పెదవిపైఁ బెట్టుకొని
బుడి బుడి యాసలేల పోఁగువేసేవే. IIపట్టII

కుమ్మరింపుదమితోడ గుబ్బలనొరసుకొంటా
వుమ్మగిలు రతులేల వొడిగట్టేవే
ఇమ్ముల శ్రీవేంకటేశుఁ డీతఁడే నన్ను నేలె
దొమ్మి చుట్టారికా లెన్ని తొరలించుకొనేవే. IIపట్టII ౨౯-౧౨౮

0 comments

Feb 25, 2009

ఇంతులాల చూడరే యీకె బాగులు

దేశాక్షి
ఇంతులాల చూడరే యీకె బాగులు
వింత వింత సింగారాల వినోదించీ నిపుడు. IIపల్లవిII

వెలఁది నవ్వులనే వెన్నెలలు గాసీని
తొలుతనే మొగము చంద్రుఁడు గనక
వలపుల చెమటల వానలు గురిసీని
మెలుపునఁ దురుమే మేఘము గనక. IIఇంతుII

కొనచూపుల దూరనఁ గోలలుగాఁబొంచి యేసీ
నును బొమ్మలే సింగిణులు గనక
తన మాఁటలను తియ్యఁదనములు వెదచల్లీ
నినుపుఁగెమ్మోవి తేనియపెర గనక. IIఇంతుII

వడిఁ గళల బదారు వన్నెలతో మెరసీని
అడరి తానే కనకాంగి కనక
గుడిగొని పెద్ద చనుఁగొండలతో చెలరేఁగీ
యెడయక శ్రీవేంకటేశు దీవి గనక.౨౯-౪౧౯

0 comments

Feb 21, 2009

ఔనయ్యా మంచివాఁడ వౌదువయ్యా

సాళంగ నాట
ఔనయ్యా మంచివాఁడ వౌదువయ్యా
పూని పట్టి వలపులు పులియఁ బెట్టుదురా. IIపల్లవిII

సిగ్గువడ్డాపె నొయ్యనే చెక్కు నొక్కుదురు గాక
బగ్గనను గిలిగించి పచ్చి సేతురా
వొగ్గి తలవంచుకుంటే నొడఁబరతురు గాక
బెగ్గిల లేఁతచన్నులు పిసుకుదురా. IIఔనII

ముసుఁగు వెట్టుకుంటే మొగము చూతురు గాక
అసురుసురై పెనఁగి అలయింతురా
అసు(స)దై వుండిన కన్నె నాదరింతురు గాక
కిసుకాటపురతుల గిజిబిజి సేతురా. IIఔనII

దండనింతి గూచుండితే తమి రేఁతురు గాక
గండుమీరి మేనెల్లా రేకలు దీతురా
నిండార శ్రీవేంకటేశ నెలఁత నిన్నుఁ గూడెను
దుండగపు సరసాన దొమ్మి సేతురా. IIఔనII౧౪-౧౪౮

కిసుకాటపు= మోటు

0 comments

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks