నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Showing posts with label అహోబలనృసింహుడు. Show all posts
Showing posts with label అహోబలనృసింహుడు. Show all posts

Dec 10, 2008

సగము మానిసి రూపు సగము మెగము రూపు

నాట
సగము మానిసి రూపు సగము మెగము రూపు
అగణితప్రతాపుఁ డహోబలేశుఁడు. IIపల్లవిII

గద్దెమీఁద గూచున్నాఁడు కంబములోఁ బుట్టినాఁడు
కొద్దిమీరఁ గడునవ్వుకొంటా నున్నాఁడు
వొద్దనె శ్రీసతిసన్ను లొరయుచు నున్నవాఁడు
అద్దివో చూడరమ్మ అహోబలేశుఁడు. IIసగII

పెనుమీసాలవాఁడు పెదపెదగోళ్ళవాఁడు
ఘనునిఁగాఁ బ్రహ్లాదునిఁ గాచుకున్నాఁడు
మనసిచ్చిన సురలతో మాటలాడుచున్నవాఁడు
అనుపమతేజుఁడమ్మ అహోబలేశుఁడు. IIసగII

వేవేలుచేతులవాఁడు వెన్నెలచాయలవాఁడు
భావించి కొల్చినవారిపాలిటివాఁడు
శ్రీవేంకటగిరిమీఁదఁ జేరి భవనాశిదండ
నావల నీవల మించె నహోబలేశుఁడు.IIసగII౧౮-౨౦౯

0 comments

Oct 25, 2008

వేదములు నుతించఁగ వేడుకలు దైవారఁగ

శంకరాభరణం
వేదములు నుతించఁగ వేడుకలు దైవారఁగ
ఆదరించీ దాసుల మోహననారసింహుఁడు IIపల్లవిII

నెఱులజడలతోడ నిక్కుఁగర్ణములతోడ
కుఱుచకొమ్ములతోడ కోఱలతోడ
వుఱక సిరిఁ దొడపై నుంచుక సింహాసనాన
మెఱసీఁ బ్రతాపములు మేటి నారసింహుఁడు. IIవేదII

నిడుప మీసాలతోడ నిట్టూరుపులతోడ
మిడిగుడ్లతోఁ దెల్లనిమేనితోడ
వొడలసొమ్ములు వెట్టి వొడ్డోలగమై వుండి
కడు మంచివరాలిచ్చీ ఘననారసింహుఁడు. IIవేదII

చిలుకుగోళ్ళతోడ సెలవి నవ్వులతోడ
బలుజిహ్వతోడ యోగపట్టెముతోడ
అలరి శ్రీవేంకటాద్రి నహోబలగిరిని
అల ప్రంహ్లాదునిఁ గాచె నాదినారసింహుఁడు. IIవేదII ౨-౨౭౮

0 comments

జయ జయ నృసింహ సర్వేశ

Get this widget | Track details | eSnips Social DNA


సాళంగనాట
జయ జయ నృసింహ సర్వేశ
భయహర వీర ప్రహ్లాదవరద IIపల్లవిII

మిహిరశశినయన మృగనరవేష
బహిరంతస్థలపరిపూర్ణ
అహినాయకసింహాసనరాజిత
బహుళ గుణగణ ప్రహ్లాదవరద IIజయII

చటుల పరాక్రమ సమఘనవిరహిత
నిటలనేత్ర మౌనిప్రణుత
కుటిలదైత్యతతి కుక్షివిదారణ
పటువజ్రనఖ ప్రహ్లాదవరద IIజయII

శ్రీ వనితాసంశ్రిత వామాంక
భావజకోటిప్రతిమాన
శ్రీవేంకటగిరిశిఖరనివాస
పావనచరిత ప్రహ్లాదవరద IIజయII౨-౨౬౮౯

0 comments

వినరయ్య నరసింహ విజయము జనులాల

నాట
వినరయ్య నరసింహ విజయము జనులాల
అనిశము సంపదలు నాయువు నొసఁగును. IIపల్లవిII

మొదలఁ గొలువుకూటమున నుండి కశిపుఁడు
చదివించెఁ బ్రంహ్లాదుని శాస్త్రములు
అదన నాతఁడు నారాయణుఁడే దైవమనె
అదరిపడి దైత్యుఁడు ఆతనిఁ జూపుమనె. IIవినరయ్యII

అంతటఁ బ్రంహ్లాదుఁడు 'అన్నిటానున్నాఁ'డనియె
పంతమున దానవుఁడు బాలునిఁ జూచి
యెంతయుఁ గడఁకతోడ 'ఇందులోఁ జూపు'మని
చెంతనున్న కంబము చేతఁగొని వేసె. IIవినరయ్యII

అటమీఁదట బ్రహ్మాండం బదరుచు
కుటిలభయంకరఘోషముతో
చిట చిట చిటమని పెట పెట పెటమని
పటపట మనుచును బగిలెఁ గంబము. IIవినరయ్యII

కులగిరు లదరెను కుంభిని వడఁకెను
తలఁకిరి దైత్యులు తల్లడిలి
కలఁగెను జగములు కంపించె జగములు
ప్రళయకాలగతిఁ బాటిల్లె నపుడు. IIవినరయ్యII

ఘననారసింహుఁ డదె కంబమునందు వెడలె
కనుపట్టె నదిగొ చక్రజ్వాలలు
మునుకొని వెడలెఁ గార్ముకముక్తశరములు
కనకకశిపునకుఁ గలఁగె గుండియలు. IIవినరయ్యII

అడరె నద్దేవునికోపాగ్నులు బెడిదపు-
మిడుఁగురులతోడుత మిన్నులుముట్టి
పిడుగులు రాలేటి భీకర నఖరములు
గడుసు రక్కసునికి గాలములై తగిలె. IIవినరయ్యII

తొడికి పట్టి విష్ణుఁడు తొడమీఁద నిడుకొని
కడుపు చించెను వాని గర్వమడఁగ
వెడలెఁ జిల్లున వానివేఁడి నెత్తురు నింగికి
పొడి వొడియాయ శత్రుభూషణములెల్లను. IIవినరయ్యII

నెళ నెళన విరిచె నిక్క వాని యెముకలు
పెళ పెళ నారిచి పెచ్చు వెరిగె హరి
జళిపించి పేగులు జంద్యాలుగ వేసుకొనె
తళుకుఁగోరలు తళతళమని మెరిచె. IIవినరయ్యII

పెటలించి నరములు పెరికి కుప్పలు వేసి
గుటగుటమని రొప్పె గోవిందుఁడు
చిటిలించి కండలు చెక్కలు వారఁజెండి
కుటిలదానవుఁ జూచి 'ఖో'యని యార్చెను. IIవినరయ్యII

తెంచి శిరోజములు దిక్కులకు వాని-
పంచప్రాణములుగొనెఁ బరమాత్ముఁడు
అంచెల నీరీతిని ప్రంహ్లాదునిపగ నీఁగె
మించి దేవతలు మితిమీఱి జయవెట్టిరి. IIవినరయ్యII

అప్పు డిందిరాదేవి యంకమునఁ గూచుండె
వొప్పుగ శాంతమందె నహోబలేశుఁడు
తప్పక కోనేటిదండఁ దానై యిందును నందు
చిప్పిలి వరములిచ్చీ శ్రీవేంకటేశుఁడు. IIవినరయ్యII

అనిశము=ఎల్లప్పుడు
అదన=? (అప్పుడు?)
కడకతోడ=ప్రయత్నముతోడ
కార్ముకముక్తశరములు=వింటినుండి వెలువడిన బాణములు
అడరె=అతిశయించె
బెడిదపు=భయంకరమైన,అధికమైన
నఖరములు=గోళ్ళు
తొడికి=ఒడిసి
నెళ నెళన=విఱుగుటయందగుధ్వన్యనుకరణము
నిక్క=నిశ్చయముగా
అంకము=ఒడి

2 comments

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks