నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Showing posts with label చర్ల గణపతి శాస్త్రి. Show all posts
Showing posts with label చర్ల గణపతి శాస్త్రి. Show all posts

Apr 27, 2010

త దేజతి తన్మైజతి, తద్దూరే తద్వ దంతికే

త దేజతి తన్మైజతి, తద్దూరే తద్వ దంతికే
తదంత రస్య సర్వస్య, తదు సర్వ స్యాస్య బాహ్యతః.
5

కం.
అది కదలును మఱి కదలదు
అదెవరి కందనిది గాని యందఱ కందున్
అది యన్నిటిలోపలఁ గల
దది యన్నిటి బయటఁ గూడ నగపడుచుండున్.


ఆయాత్మ కదులును, అది కదలదు, అది దూరముగ నున్నది. అట్లే దగ్గరగ నున్నది. అది యీ సర్వప్రపంచముయొక్క లోపల నున్నది. అది యీ సర్వప్రపంచముయొక్క వెలుపలను ఉన్నది.

0 comments

Apr 26, 2010

అనేజ దేకం మనసో జవీయో, నై నద్ధేవా ఆప్ను వన్ పూర్వమర్షత్

అనేజ దేకం మనసో జవీయో, నై నద్ధేవా ఆప్ను వన్ పూర్వమర్షత్
తధ్ధావతో2న్యా నత్యేతి తిష్ఠత్, తస్మిన్న పో మాతరిశ్వాదధాతి

"యచ్ఛాప్నోతి య దాదత్తే, యచ్ఛాత్తి విషయా నిహ

య చ్చాస్య సంతతో భావ, స్తస్మా దాత్మేతి కీ ర్త్యతే ".
4

మధు.
మెదల దొకటె యాత్మము, కాని మించు మనోజవంబు
గదియలేరు దేవులు దాని ; కాని ముందదియె పోవు
అది కదలకయె పరువెత్తు నన్నింటి దాటిపోవు
అదియె యుండఁగ వాయువు ప్రాణుల పనులు దిద్దు.


దేవులు - ద్యోతనస్వభావముగల నేత్రాది జ్ఞానేంద్రియములని శంకరులు. ఆత్మ ఆకాశమువలె సర్వవ్యాపియు నామరూపాదులు లేనిదియుఁ గాన కదలకయె యన్నిటిని దాటి యుండునని భావము.

ఆత్మ కలదు, ఒకటె. మనసుకంటె వేగము గలది. దీనిని దేవులు - (ఇంద్రియములు ) సమీపింపలేరు. అది ముందుగానే పోవును. అది కదలనిదై పరువెత్తుకొనిపోవునట్టి యితరేంద్రియములను అతిక్రమించి పోవును. ఆ యాత్మ యన్నపుడు వాయువు ప్రాణులకు చేష్టాదిశక్తులను విభజించుచున్నది. ఆత్మ పదమునకు వ్యుత్పత్తి యీ విధముగాఁ జెప్పబడినది.

అన్నిటిని వ్యాపించునది, అన్నిటిని దనయందు లయింపఁ జేయునది, విషయముల ననుభవించునది, త్రాటియందుఁ బాముగుణములవలె దీనియందు ప్రపంచరూపము లారోపింపఁబడునుగాన " ఆత్మ" అని వ్యుత్పత్తి.( చర్ల గణపతి శాస్త్రి గారి ఉపనిషత్సుధ నుండి )

0 comments

కుర్వ న్నే వేహ కర్మాణి, జిజీవిషే చ్ఛతం సమా:

కుర్వ న్నే వేహ కర్మాణి, జిజీవిషే చ్ఛతం సమా:
ఏవం త్వయి నాన్యథేతో2స్తి, న కర్మ లిప్యతే నరే .
కం.
ధరఁ గర్మలు చేయుచునే
నిరతము నూరేండ్లు బ్రతుక నెంచఁగ వలయున్
మఱొకగతి లేదు నీ కిఁక
నరసి యిటులు చేయఁ గర్మ లంటవు నరునిన్. 2

కర్మలు - అగ్నిహోత్రాది కర్మలని పూర్వులు, స్వస్వభావోచిత కర్మలని నవీనులు.

ఈ లోకమందు కర్మలు చేయుచునే నూరుసంవత్సరములు జీవింపఁ గోరవలయును. మఱియొక మార్గము లేదు. ఇట్లు జీవింపఁ గోరు నరుఁడవయిన నీకు అశుభకర్మములు అంటుకొనవు.

0 comments

ఈశావాస్యమిదం సర్వం, యత్కించ జగత్యాం జగత్

ఈశావాస్యమిదం సర్వం, యత్కించ జగత్యాం జగత్
తేన త్యక్తేన భుంజీథాః, మా గృధ: కస్య స్విద్ధనం , 1
కం.
భగవంతుడు భువి మాఱుచు
నగపడు నీ ప్రతిపదార్ధమందును నుండెన్
తగ నది త్యాగము చే నిపు
డె గాచికొను ; మిది యెవరి ధనంబౌ.
సంస్కృతమున "ఈశావాస్య" అని మొదలు పెట్టఁబడుటచే ఈశావాస్యోపనిషత్తు అని పేరు వచ్చెను. అవిద్యను అజ్ఞానమును నశింపఁ జేయునదిగాన ఉపనిషత్తు అని వ్యుత్పత్తి.
జగతిసందు మార్పుచెందు నిది యంతయుఁ బరమేశ్వరునిచే నిండియుండెను. దానిని త్యాగముచే నిన్ను రక్షించుకొనుము. దేనిని గోరకుము. ఇది యెవరి ధనము ?

0 comments

ఈశావాస్యోపనిషత్

ఈశావాస్యోపనిషత్
ఆవాహన / నాందీ శ్లోకం:

ఓం పూర్ణమద: పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావిశిష్యతే

కం.
పూర్ణము బ్రహ్మము జగ మిది
పూర్ణమ; యాపూర్ణునుండి పూర్ణము వెడలెన్
పూర్ణం బగు నీజగతికిఁ
బూర్ణత్వము గూర్చి యింకఁ బూర్ణమె మిగులున్.


ఆ బ్రహ్మమంతట వ్యాపించినది. నామరూపసహితమైన యీ జగమును అంతట వ్యాపించినదె. ఆ పూర్ణమైన బ్రహ్మమునుండి పూర్ణమైనజగము బయలుదేరుచున్నది. జగమునకు పూర్ణత్వమును గలిగించి యాపూర్ణమైన బ్రహ్మమె మిగిలినది.


పైన వ్రాసిన విషయములు శ్రీ చర్ల గణపతి శాస్త్రి గారి ఉపనిషత్సుధ మొదటి భాగము -1 నుండి ఎత్తి వ్రాయబడినవి. 
వారు ఈ పుస్తకములో ఈశ కేన కఠ ప్రశ్నోపనిషత్తులను తెలుగు పద్యములుగా తెనిగించిరి.



      

0 comments

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks