నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Showing posts with label నిర్వచనరామాయణం. Show all posts
Showing posts with label నిర్వచనరామాయణం. Show all posts

Apr 28, 2010

నిర్వచన రామాయణం

సంగ్రహ నిర్వచన రామాయణం - ఈ పుస్తకాన్ని ఎప్పుడు కొన్నానో గుర్తు లేదు. ఈ రోజే చదువుదామని మొదలు పెట్టాను. పుస్తకం క్రింద పెట్టకుండా చదివించింది. ఉదయం మొదలుపెట్టి సాయంకాలానికి పూర్తిచెయ్యగలిగాను. దీని రచయిత కీర్తి శేషులు దరిమడుగు మల్లయ్య గారు. కుల్లూరు గ్రామం, నెల్లూరు జిల్లా. ప్రకాశకులు:దరిమడుగు మల్లికార్జునరావు,కర్నూలు రోడ్డు, ఒంగోలు - 2. టి.టి.డి. వారి ఆర్ధిక సహాయంతో ప్రచురించబడింది. మొదటి ముద్రణ ఏప్రియల్ 1988. వెల 27 రూపాయలు.

రామాయణ గాథను ఎందరెందరో ఎన్నెన్నో విధాలుగా - పద్యకావ్యాల రూపంలో గాని, వచనకావ్యాలు గా గాని, ద్విపదలుగా గాని , వ్యాఖ్యాన సహిత మందరాలుగా గాని, కల్పవృక్షాలుగా గాని, ఆటవెలదుల రూపంలోగాని, గద్యపద్యాత్మకంగా గాని, నిర్వచన గ్రంథాలుగా గాని నాటక రూపంలో గాని - ఇలా ఎన్నెన్ని ప్రక్రియలు అందుబాటులో ఉంటే అన్నన్ని ప్రక్రియలలోనూ మన ఆంధ్రులు వ్రాసుకుని, చదువుకుని , పాడుకుని, ఆడుకుని ఆనందిస్తూ ఉన్నారు. ఇన్నిన్ని రకాలుగా ఇందరిందరు ఆదరిస్తున్నారంటే అది ఆ కథ కున్న గొప్పదనం, ఆదర్శ పురుషుడుగా రూపొందించబడ్డ ఆ  శ్రీరామావతారపు  గొప్పదనం. దానిని ఆదికవి వాల్మీకి తీరుగా మలచి మన కందించిన రామాయణ గ్రంథం గొప్పదనం.
దరిమడుగు మల్లయ్య గారి గ్రంథం లో ఉత్తరకాండ లేదు. వీరి రచన పూర్తి ద్రాక్షాపాకం. సులభమైన శైలి. నిఘంటువులు చూడాల్సిన అవసరం కలగదు. మంచి ధారతో సాగిపోతుంటాయి వీరి పద్యాలు. ఉదాహరణ ప్రాయంగా కొన్నింటిని ఇక్కడ ఉదాహరిస్తాను.
రామ కథను గుఱించి--
సీ.
పుడమి పాలకులకే పురుషోత్తముని రాజ్య
మాదర్శమై నేటి కలరుచుండు
ఏకపత్నీ వ్రతాస్తోక ధర్మమునకే
వాని వర్తన కొలబద్ద యయ్యె
ఎనలేని పితృభక్తి కే వీరుని చరిత్ర
తరతరాలకు మార్గదర్శి యయ్యె
పట్టాభిషేకంబు వనవాస గమనంబు
సమదృష్టి గై కొన్న శాంతు డెవడు
తే.
ఎవని సహధర్మచారిణి యిద్ధ చరిత
మఖిల లోకాల కాదర్శమై వెలింగె
అట్టి గుణనిధి శ్రీరాము డనవరతము
కీర్తనీయుండు గాదె యఖిల జనులకు.
తే.
అట్టి ఆదిపురుషుని యవతార మందు నాది
కావ్య మగుటను వేదాను కారి యగుట
భక్తి పారాయణ మొనర్చి వాంఛితార్థ
సిద్ధి గనుచుందురనుట ప్రసిద్ధమెగద !

శ్రీరాముని గుణగణాలను వర్ణిస్తూ --
చ.
అనుపమ రూప సద్గుణ గణాధికుడై జనకోటి చిత్త రం
జనుడయి సర్వమానవ విశాల సుదృక్పధుడై ప్రసన్నుడై
మనునిభుడై గురూత్తముల మాన్యుల ముందు వినమ్రుడై వివ
ర్ధను డగుచుండె చూపరకు ధన్యత గూర్చుచు రాము డెంతయున్.

అహల్యా వృత్తాంతంలో అహల్యను గుఱించి అంటారిలా --

తపసి సేవలందు దనియుదురే వయః
పరిణతాంగులైన భామలెందు.
గీ.
భూర్భువంబులందు బుట్టెడి జీవులు
కామ విజయమింత గాంచగలరే
గరళమాహరించు పరమేశ్వరుడు దక్క
నన్నమయ శరీరు లర్హులెట్లు. 
అంటారు.

చాలాచోట్ల సామెతలవంటి ప్రయోగాలు చాలా చేసారీయన తన రచనలో.

పాపపు ఫలమేల తప్పు బలియుర కైనన్.

వికసిత హృదయంబులు రెం
డొకటిగ నతుకుటయె పెండ్లి యువతీయువకుల్

ఆడుపులి గాదె వృద్ధాప్యమక్క టకట.

తలచిన పనులేలగావు ధరణీశులకున్

--------------------------స్వార్ధ పరులు
పరిగణింతురె సుంతైన పరులబాధ.

పతి సమీపము సతికెంత పరమ సుఖమొ.

పెక్కు ధనములున్న మక్కువ సుతులున్న
నాతి భర్త లే కనాథ గాదె! (లేక+అనాథ)

తాపసుల కెగ్గొనర్చిన
పాపాత్ములు సేమమందు వారలె యెందున్.

భువన భారంబు శేషుడే పూనవలయు
వానపాముల కలవియే వసుధ దాల్ప.

రవి యుదయింపకున్న తిమిరం బడగించెడి దీపమున్నదే.

------------------------------------------ అధోముఖంబుగా
పరగునె యగ్నికీలలెటు తిప్పిన నుత్పధగాములే గదా !

పతికి నెనయగు దైవంబు పత్ని కేది ?

దుష్టశిక్షణంబు శిష్టరక్షణంబు
సలుపలేని వాడు క్షత్రియుండె !

కుడిచి కూర్చుండ నేరక కొంపగూల్చు
కొనెడి తలసీలగల్గెనో కోయటంచు.

చేటుకాలమునకు చెడుబుద్ధులన్నట్లు

పరహితంబున నసువు లర్పణ మొనర్చు
జన్మమే జన్మమది భువి సార్ధకంబు.

ధనువిదేల నాకు తనువిదేల ?

యత్నమొనరించి జాడ దీయంగ వలయు
యత్నపరులకె దైవ సహాయ మొదవు.

---- సద్వర్తనులైన మానవులనే కీడుల్ వరించుం గదా !

కష్టపడియును ఫలితంబు గాంచనైతి.

చావు సహజంబు పుట్టిన జంతుతతికి
గాన రణరంగ మరణమే కాంక్షితంబు.

ప్రాణ మున్నంతకే గదా పగలు వగలు.

కాలచక్రమునకు గమనంబు నిల్చునే
క్షణము వెనుక క్షణము జరుగుచుండు.

దిక్కరి చావనైనను పతివ్రత మానము గోలుపోవునే.

కంతు జయంబు మర్త్యులకు గల్గిన మృత్యుజయంబు గల్గదే ?

పరశురామ ప్రీతి బరగజేసె.

ఇటువంటి అందమైన నుడులు నానుడులు ఎన్నెన్నో ఉన్నాయి ఈ పుస్తకంలో.

ఇవేకాక కథాసందర్భంనుంచి విడిగా చెప్పుకోదగిన పద్యాలు కూడా చాలా ఉన్నాయి. మచ్చుకు ఒకటి రెండు..

స్నేహితుని గుఱించి -
తన శుభంబుల గాంచి సంత సిలువాడు
కడు దరిద్రంబు లోన రొక్కమిడువాడు
ఆపదల నాదు కొనగలయట్టి వాడు
జీవితంబున కొక్కడే స్నేహితుండు.

కర్మమునబుట్టు జంతువు
కర్మముననవృద్ధి బొందు కర్మమున జెడున్
కర్మమె దైవంబని తా
నిర్మల కర్మం బొనర్ప నేర్వగ వలయున్.

కనకపు గట్టెంకించెడి
ఘనతరమగు నాసజూపు కాలంబందే
ఎనలేని దుఃఖసముదయ
మునకు న్నిష్కరుణ ద్రోయు పో విధి యెందున్.

వృద్ధమగల ప్రార్ధనోక్తులు వలతురే
పడుచుదనము గల్గు భామలెందు
వేడుచున్నకొలది ద్వేషింతురే గాని
అసమ వయసు మతుల నతుకవశమె.

రాజ్యకాంక్ష జేసి రమణుల తనుజుల
నైన నమ్మకుందు రధిపులెందు
నమ్మినట్ల యుండి నమ్మమి యురవగు
నీతియండ్రు ధర్మనిపుణమతులు.

అయోధ్యా కాండం ప్రారంభంలోని అందమైన సీస పద్యాన్నోసారి గమనించండి.

మోముపై చర్మంబు ముడుతలు తఱుచగు
చూపుపై నరచేయి ప్రాపుగొనును
తరుణి దూరంబగు తలయెల్ల తెల్లనౌ
మిసమిసమీసాలు పసదొలంగు
తనువున బలసంపద తొలంగు దంతంబు
లను బంధులొక్కొక్కరవల దొలగు
భత్యమియ్యని భృత్యు కైవడి
యావదింద్రియములు నాజ్ఞమీరు

జరభరంబున కోర్వక శిరము వడకు
వార్థకపు భూషణంబగు వంకుకర్ర
యేమఱకయుండు ముదివగ్గు నేమిజెప్ప
నాడుపులిగాదె వృద్ధాప్య మక్కటకట.

ఆయువల్పమైన నాసయు నధికమై
చేతులుడుగుచుండ చింతలెదుగు
పడుచువారి చేష్టలుడికించు వృద్ధుల
ముసలితనముకంటె ముప్పుగలదె.

సీతారాములవివాహసమయంలో వారు ఒకర్నొకరు ఈ విధంగా చూసుకున్నారట.
సీ.
వరుని చూపులుతన్వి శిరముపై వ్రాలి మో
మునజేరి కన్నుల మున్గితేలి
చెక్కిళ్ళపైనుండి జక్కవ చనుదోయి
దూరి మధ్యంబు పై దొడరి పాద
తలమున జేరంగ తన్వి వీక్షణములు
వరుని పాదాబ్జంబులరసి పెరిగి
జానుయుగ్మకము విశాల వక్షస్థలి
నరసి సుందర వదనారవింద
మందుబ్రాకియు సిగ్గుచేనచటనుండి
మరలిస్వస్థానమునజేరు నిరువురిట్లు
ప్రియునపాంగ వీక్షణముగల
నూతనప్రేమవీక్షణోపేతులైరి.

ఇంకా ఇంకా చాలా చాలానే వ్రాయాలనుంది కాని చదువరులకు ఇబ్బంది కలగొచ్చునేమో అనిపించి యిక్కడితో ముగిస్తున్నాను. మీ మీ అభిప్రాయాలు తెలియపరిస్తే సంతోషించగలవాడను.



1 comments

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks