నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Showing posts with label విశ్వనాథ సత్యనారాయణ. Show all posts
Showing posts with label విశ్వనాథ సత్యనారాయణ. Show all posts

Aug 27, 2009

ఇరువదినాలు గేండ్లుగ నిదెప్పు డిదెప్పు డటంచుఁ గన్నులం

అభిషేక ఖండము
శ్రీరామ పట్టాభిషేక వార్తను రాముని ద్వారా విన్న కౌసల్య రామునితో ఇలా పలికినది।
చ।
ఇరువదినాలు గేండ్లుగ నిదెప్పు డిదెప్పు డటంచుఁ గన్నులం
దెఱచి ప్రతీక్ష చేయుదుగదే, జగదేకధనుష్కలానిధీ !
విఱచిన వెండికొండదొరవింటిని వింటినిగాని చూడలే
దఱుత వహింప ధాత్రిఁ గనులారగఁ జూతునురా కుమారకా ! ७६

రాముని వయసు అప్పుడు २४ సంవత్సరాలన్నమాట। విఱచిన వెండికొండదొరవింటిని వింటినిగాని -మంచి అందమైన అనుప్రాసం। పాపం కౌసల్య ఆశపడింది కాని జరిగింది మాత్రం వేరు।

మంథర నిదురలోనున్నకైకేయిని నిదుర లేపి ఆమెతో ఇలా అంటుంది।
గీ।
అవునె దౌర్భాగ్య మాకారమైన దాన!
నీకు నిదుర యెటుపట్టునే దరిద్రు
రాల ! యొకవంక నింటిచూరంటుకొనిన
సొగసుగాఁ జలి కాగెఁడుపగిది తోఁప। १०५

సామెతలంటే విశ్వనాథవారికెంతిష్టమో కదా.
క।
మిన్నొక పెడపెడ చీలుచు
కొన్నది యాయేమి గుబులుకొన్న సవంబో
నిన్నను లే దభిషేకపు
సన్నయు నే మంత దొంగచాటుతనంబో ! १०६

కైకేయిని రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో మంథర అన్న మాటలు
గీ।
పిల్లవానిని భరతుఁ బంపించినాఁడు
మేనమామల యిండ్లకుఁ, దా నెఱుంగు
మన్నుదిన్నపామ వటంచు నిన్ను రాజు
ఇంక భయ మేటికో? దాచుటేలొ యింక ? १०७

రెచ్చగొట్టటానికి ఉపయోగించే మాటనేర్పు.
మ।
తనకుం గన్నులు విప్పుకో ల్పడవటే , తా వచ్చి పెద్దమ్మ నె
త్తినిఁ గూర్చున్నది యేమొ కావలయు, ధాత్రీజాని రాముండె య
య్యెనయేనీ తినఁగూడు లేదుజుమి నాకేకాదు నీకున్ , బురా
తనవైరంబులు సర్వమున్ సవతి పంతా ల్పాతరల్ తీసెఁడున్। १०८

నీ నెత్తిని శనిపెద్దమ్మ వచ్చి కూర్చున్నది కాబోలు, నీకనులు తెఱిపిళ్ళు పడటం లేదు। రాముడే రాజయినట్లైతే నాకే కాదు నీకుకూడా తినడానికి కూడుండదు రేపటినుంచీని। నీ సవతి కౌసల్య పాత వైరాలనన్నిటినీ తవ్వి బయటకు తీస్తుంది గదా।

0 comments

Aug 26, 2009

గోళకాంతిచ్ఛటల్ పెఱగోళములకుఁ బయనంముంజేయ నబ్దముల్ పట్టునట్లు

శ్రీమద్రామాయణ కల్పవృక్షము
అభిషేక ఖండము
గీ.
గోళకాంతిచ్ఛటల్ పెఱగోళములకుఁ
బయనంముంజేయ నబ్దముల్ పట్టునట్లు
రాచ దేవిడీలందు వార్తలును జేరఁ
బ్రభువు ప్రభువును మధ్య నబ్దములు పట్టు. 3

ఒకగోళమునుండి కాంతిప్రసారం బయలుదేరి ఇంకో గోళానికి చేరటానికి కొన్నిసంవత్సరాల కాలం పడుతుంది. అలాగే రాచ దేవిడీలలో కూడా వార్తలు ఒక ప్రభువు నుండి ఇంకో ప్రభువుని చేరటానికి కొన్ని సంవత్సరాలు పట్టిందట. రాముని మనస్సులో పెండ్లి అయి భార్యతో ఆనందంగా గడపాల్సిన సమయంలో కలిగిన వైరాగ్యభావమును గురించిన వార్త దశరథ మహారాజునకు చేరటానికి కొన్ని సంవత్సరాలు పట్టిందట.
ఉ.
రామున కాత్మలో నొక విరాగము కల్గినమాట, యా విరా
గామితతీప్రతల్ చెడి తనంతన శాంతివహించు పిమ్మటన్,
దా ముదిఱేనికిన్ దశరథక్షితిజాని కెఱుంగనయ్యెఁబోఁ
బ్రామిన భీతియున్ దరతరై మనుజేశుఁడు దందడించుచున్. 4

ఆ విషయం తెలిసిన తర్వాత దశరథుఁడు మరింక ఆలస్యం చేయలేదు. ఎందుచేతనంటే
గీ.
బ్రహ్మచారి సుతుండు విరాగియైన
జనకుఁ డూహించు సుతు గృహస్థునిఁ బొనర్పఁ
దా గృహస్థుండె సుతుఁడు విరాగియైనఁ
దండ్రి వ్యవహార మతనిని దాల్పఁ జేయు. 5

బ్రహ్మచారిగా నున్నకొడుకు విరాగి గా నైతే తండ్రి అతనికి పెళ్ళి చేస్తే బాగుపడతా డనుకుంటాడట. పెళ్ళైన కొడుకు విరాగిగా నైతే తండ్రి అతనిని వ్యవహారం లోనికి దింపాలని అనుకుంటాడట. అందుచేత అతనికి యువరాజ పట్టాభిషేకం చేయాలని సంకల్పిస్తాడు దశరథుడు.
ఈ భావన అంతా విశ్వనాథ వారి అందమైన స్వకపోల కల్పనే. మూలంలో రామునిలో విరాగభావం కలిగినట్లుగా లేదు. గోపీనాథ గామాయణంలో అలా వ్రాసిలేదు. సంస్కృత రామాయణం విషయంలో ఎలా వుందో పెద్దలే చెప్పాలి.

0 comments

Aug 19, 2009

నంతలో నంత తొలఁగియు నంతగాఁగ నెంతయో గాని తెలయనియంత యగుచు

సీ.
ఆ వివాహానంద మదియు నకామహ
తుండయి చను శోత్రియుండు దశర
థునితో మొదలువెట్టి తనరారి బ్రహ్మయై
న వశిష్ఠునెడఁ బ్రమాణంబు పొంది
యభయుఁడౌ జనకునం దనవధియౌచు వి
దేహాంతమైన విస్తృతి వహించి
ముగురు తమ్ముల పెండ్లముల యందుఁ గించి దూ
నంబుగాఁ దతవి కుంఠంబు నగుచు
గీ.
రామచంద్రునియందుఁ బూర్ణంబు నగుచు
నంతలో నంత తొలఁగియు నంతగాఁగ
నెంతయో గాని తెలయనియంత యగుచు
నవనిజాకృతిఁ దెలిసిన దగుచుఁ బొలిచె. 93

ఆ సీతారామ వివాహానందము దశరథునితో మొదలుపెట్టి సీతాదేవి వరకూ ఎలా విస్తరించిందో తెలియచేసారీ పద్యంలో.
ఉ.
చిత్రపుఁ జేత పళ్ళెరము చేఁగొని రత్నపుదివ్వె వెల్గు లా
రాత్రిక పట్టె శాంత మధురంబగు వీణియ తోడురాఁగ ను
ద్గాత్రధినేతయై చను నొకానొక వైణికసామవేది హ
స్తత్రయక్ఌప్తిగాఁగ మఱదండ్రయుఁ దమ్ముల కండ్ల కద్దుచున్. 94

క క్రింద ఌ వ్రాయటం రాలేదు గమనించగలరు.
వ.
అంత నా రాత్రి స్థాలీపాకానంతరమ్మున-98
సీ.
ఆ ధృవనక్షత్ర మనుసరించిన రేఖ
మలయుచో సప్తర్షి మండలంబు
నాల్గు నక్షత్రముల్ నాల్గు మంచముకోళ్ళ
వలె నున్న యెడఁ దుదివంక మూఁడు
సాగినయట్టి నక్షత్రమ్ములన్ మధ్య
వారు వశిష్ఠులు వారిప్రక్క
మినుకు మిన్కంచుఁ దాఁ గనిపించు లీలగా
నామె యరుంధతి యంచుఁ జూపె
గీ.
శ్రీవశిష్ఠులు రాఘవశిశువులకును
బాలరాముండు జానకివంకఁ దల్లి
వంక నచటి యరుంధతివంకఁ జూచి
మహియ తలఁచె యరుంధతీమయముగాఁగ. 99
గీ.
అట్లరుంధతీమయ మైన దగు వివాహ
యజ్ఞము సమాప్తమై చతురంగబలము
తోడ మగపెండ్లివారు తోడ్తో నయోధ్య
కై పయనమైరి సందడి యతిశయిల్ల. 100

0 comments

Aug 12, 2009

ఒక పెద్ద కెరటము నొక పెద్ద కెరటము గలసి యన్యోన్యంబుఁ గౌగిలించుఁ

కల్యాణ ఖండము

సీతా రామ కల్యాణము
సీ.
ఒక పెద్ద కెరటము నొక పెద్ద కెరటము
గలసి యన్యోన్యంబుఁ గౌగిలించుఁ

నొక చిన్ని కెరటము నొకచిన్ని కెరటము

గలసిపోవును రెండుగాని యట్లు

ఒకచిన్ని కలువపూ వొకచిన్ని కలువపూ

వును గూడి యంచుల కొనలు ముట్టు

నొకరాజహంసమ్ము నొకరాజ హంసమ్ము

భువనోన్నతత్వంబు పుక్కిలించు

గీ.
దివిజభాగీరథీసరయువుల సంగ
మమ్ముపోలిక నై క్ష్వాకుమైథిలావ

నీశ్వరుల బెండ్లి వారికి నృపుని కనక

మయమహాసౌధముల సంగమమ్ము గలిగె.
66

గంగాసరయుల సంగమంగా భాసించినదట సీతారాముల కల్యాణము.
గీ.
తుమ్మిదలు పైని గ్రమ్మిన తమ్మిపూలు
నాల్గుతట్టలతోఁ దెచ్చినారు మేన
మామ లంతలోఁ జూడఁగా మథురలజ్జ
లుదయమైన రాకన్నెల వదనములుగ.77

ఎంత హృద్యమైన భావన. మన తెలుగిండ్లలో జరిగే పెళ్ళివేడుకలే.
గీ.
ఎదురు బళ్ళైన లజ్జచే నెత్తరాని
ఱెప్ప లవి యెత్తఁబడకుండఁ గ్రేవలందుఁ
బ్రక్క గూర్చున్న యప్పటి ప్రసరణంబు
ప్రసవబాణుండు నేర్చిన ప్రథమవిద్య. 79

క.
పరసుఖదశాపరీపా
కరామణీయక మెఱుంగుఁ గచసాన్నిధ్యా
త్తరమణఁ బ్రథమస్పర్శ
ప్రరూఢి మెడ వొలిచె సూత్రబంధన వేళన్. 80

గీ.
కరరుహంబులు చర్మంబు గాకపోయె
నవియుఁ బులకించునేమొ ప్రియగళాత్త
మైన స్పర్శసుఖా ప్తిఁ బ్రియాగళంబు
నంటి బాధించు వీని కేలా ! సుఖంబు.81

క.
తలఁబ్రాల వేళఁబడచును
నలఘుచ్చవి నెగురు ముత్తియంబులమిషచే
నలుకేళకూళులు వొలిచెను
నలుగురు దంపతులు మోహన స్తంభములై. 82
గీ.
నాలుగవ పాలుగా నింద్రనీలమణులు
మణులు కలియంగఁ బోసిరో యనఁగఁ బొలిచె
ముత్తెములు చతుర్దంపతి ముగ్ధతను స
మాత్త నీలర క్తచ్ఛవుల్ హత్తుకొనఁగ. 83
గీ.
అలుపములు రెండుమూఁడు ముత్యాలు నిలిచి
సీత పాపటలోఁ జిఱు చెమట పోసె
హత్తుకొని గంధపూఁత ముత్యాలు రెండు
రామచంద్రుని మేనఁ దారకలు పొలిచె. 84
మ.
పదిదోసిళ్ళకు నొక్కదోసిలి త్రపాపర్యంతమై సేసబ్రా
లొదిగించెన్ జనకాత్మజాత పతిపై నొయ్యారపున్ లజ్జ యన్
జదురౌ తొల్తటి మెట్టు డిగ్గుచుఁ డ్రపాశైథిల్య మార్గంబునన్
బోద రావేళకుఁ దీఱినట్టి కనులన్ వీక్షించుచున్ రాఘవున్. 85

సిగ్గుతో సీత పదిదోసిళ్ళకు ఒకదోసిలిగా తలఁబ్రాలు రాములవారిపై పోసినదట.
ఆ.
చంద్ర రేఖ పైని సన్నని తెలిమొయి
ళ్లాడినట్లు ముత్తియమ్ములాడెఁ
జల్లి మేనిపైని నల్లని యాకాశ
మట్లు రామచంద్రుఁ డందె యుండ. 86
ఉ.
అల్ల వివాహమండపమునై చనుచోటికిఁ జిత్రవిచిత్రముల్
కొల్లలుగాఁగ వచ్చె వెలుఁగుల్ వెసఁబెండిలివారలెల్ల ద్వా
ర్వేల్లిత దృష్టులై చినుకు వెక్కసమౌ చిఱుజల్లువానలో
ఫుల్ల విచిత్రవర్ణములు పూవులు చూచిరి లంబమాలలన్. 87
క.
ప్రతిచినుకులోనఁ బ్రతిబిం
బితములు జలజాప్తు వెలుఁగు పిండులు వలయా
కృతిమ న్మఘన ధనురలం
కృతులును గలిపించె గగనమెల్ల శబలమై. 88
క.
ప్రతి చైత్త్రశుద్ధ నవమికి
వితతంబుగఁ దెలుఁగునేల విరిసెడు జల్లుల్
సితముక్తాసదృశంబులు
ప్రతనులు తలఁబ్రాలవేళ వచ్చెఁ జిటపటల్. 89

ప్రతి సంవత్సరం శ్రీరామనవమినాడు జరిగే శ్రీ సీతారామకల్యాణం తలఁబ్రాల సమయానికి చిఱుజల్లులతో చిన్నపాటి వర్షం పడటం ఆనవాయితీగా జరుగుతూంటుంది.

ఈ సీతారామ కల్యాణంతో నా యీ నరసింహ బ్లాగులో 300 పోస్టులు పూర్తికావటం-- ఆ సీతారాములు నా మీద కురిపించిన అవ్యాజమైన దయావృష్టిగా అనిపిస్తున్నది నా మటుకు నాకు.

0 comments

Aug 11, 2009

వైదేహుసభలోన వానకురిసి వెలసినట్లయ్యె లేయెండ విరిసినట్లు

పరశురాముని గర్వభంగము
మధ్యాక్కర.
గాధిసంతతికిని నీవుగాని దగ్గఱ చుట్టమవును
సాధించి యద్దాన నిన్నుఁ జంపంగఁ జాలను నేను
వేధించి నీపాదములను విశిఖమ్ము విడువుమం చనెదొ?
సాధుభవత్త పోలోక సంతాన సంహారమనెదొ?
మ.
అనినన్ భార్గవరాముఁ డిట్లనియె దేవా ! సర్వధాత్రిన్ జిరం
తనుఁడౌ కశ్యపు చేతిలో విడిచి పాథఃవూర్వ మేనుండ నా
యన యీ ధారణియందు నన్నిలువరాదం చానవెట్టెన్ మహా
త్ముని యాజ్ఞంబడి నేనిటన్ నిశలయందున్ నిల్వ నేవేళన్. 488
గీ.
కశ్యపు ప్రతిజ్ఞ కృతమయ్యెఁ గాన స్వామి !
పాదములయందుఁ గొట్టకు వాసుదేవ !
యే మనోజవమ్మున నిట్లె యేగుదును మ
హేంద్రగిరి కందరాశ్రమ మింతలోన. 490
మధ్యాక్కర.
కేవలము తపస్సుచేత గెలిచిన కీర్తి లోకములు
నీవు ఛేదింపుము జాగు నీకుగానీ సుంత తగదు
నీవు చే విల్లంది నపుడె నీవు శార్ఙ్గివటంచు నేను
భావమం దెఱిఁగితిఁ బద్మపత్ర శోభానేత్రయుగళ! 491

మధ్యాక్కర.
వదలుము శరము మహేంద్రపర్వత ప్రత్యంతధాత్రిఁ
గదలుదు నేను మనోజ్ఞ కల్హార కమనీయనేత్ర!
వదలుము శరమన్న వదలె బాణంబు బాలరాఘవుఁడు
కదలెఁ బరశురాముఁ డంత గమనవేగ చటులమూర్తి. 493.
సీ.
అంతట విశదము లయ్యె దిక్సంతతి
విదిశలు స్వచ్ఛమై వెల్లఁబాఱె
సురలును ఋషులును స్తోత్రముల్ చేసిరి
రవివంశ మార్తాండు రామచంద్రు
భార్గవుఁ డేగిన పథమెల్ల రామనా
రాయణ తేజోమయాకృతిన్ బ్ర
దక్షిణించుచుఁ బోవు దర్శనమయ్యె స
ర్వర్షి సంఘమునకుఁ బ్రధ్నరోచి
గీ.
రధ్వములయందునను న్యూంఖరావ మొప్ప
వాయువీథులయందున వఱలి వఱలి
ప్రబలు వైదేహుసభలోన వానకురిసి
వెలసినట్లయ్యె లేయెండ విరిసినట్లు. 496
శ్రీరాముడు పరశురాముని కాళ్ళమీఁద బాణాన్ని విడువమంటావా అని అడిగితే పరశురాముడు ఆ బాణంతో తన కాళ్ళను నరకవద్దని తన తపోలోకాన్ని ధ్వంసం చేయమనీ కోరతాడు. రాముడావిధంగానే చేస్తాడు.

ధనుష్ఖండం సమాప్తం.

0 comments

Aug 10, 2009

శంఖస్వచ్ఛముగా సుదర్శనమహాచండాంశుసంఘర్షిగా

రాఁముడు వైష్ణవచాపము నెక్కిడుట
మధ్యాక్కర.
నీకర్మ లోకాద్భుతంబు నీవలె నృపలోకమెల్ల
సాకుగా నిర్వదియొక్క సారులు చంపఁగనగునె?
చేకొని తలఁచినయంత చేయంగఁ జేవయు వలదె?
కాక నీకింత కోపమ్ముఁగలిగించు గారణంబుండె. 475

చ.
అది యటులుంచి వైష్ణవశరాసన మియ్యది యెక్కు పెట్టినన్
వదలిన బాణ మెప్పుడును వ్యర్థముకాని ప్రతిజ్ఞ నాకు ను
న్నది శివచాప మక్కతమునం గల మందసమందె యమ్ము లే
నిది విదలించితిన్ బరిగణించి వచింపుఁడు మీరె నాకనన్. 476

వ. పరశురాముండిట్లనియె.

మధ్యాక్కర.
నీ వెక్కు పెట్టెదవేని నీ క్రింద నే నోడినట్లె
యావల శరమేయుటెందొ? యప్పటి యామాట చూతు
శ్రీవైష్ణవము మహాధనువు చేతి కిచ్చెదను గైకొమ్ము
నీ విశ్వమోహనకరము నిగిడించు నీరదాకార ! 478

క.
అనుటయు ధనువిచ్చుటయును
ధనువు రఘూత్తం సకమ్ము తాఁ గొనుటయు లొ
క్క నిమేషంబున జరిగెను
ధనువు తుదంబడి యొకండు తాదీపితమై. 479
శా.
శంఖస్వచ్ఛముగా సుదర్శనమహాచండాంశుసంఘర్షిగా
ప్రేంఖాగారుడపక్ష పుచ్ఛ నిబిడ శ్రీకాంతిగా వెంబడిన్
న్యూంఖోదారనినాదమేదురముగా నుద్భాంతిగానై ధనుః
పుంఖంబుంబడి తేజ మొండు వెలిఁగెన్ మున్నంచి వెన్నంచియై. 480
క.
ధనువుఁ గొనినంత రాముని
కు ననంతానంత కల్పఘోర తపస్సం
జనితమగు శక్తి తనదగు
తనువునఁ గల్గినటు తోఁచెఁ దత్కాలమునన్. 481
క.
తన సంపాదించిన పు
ణ్యనితాంతాభినవజగము లన్నియు వడి జా
రినరీతి దోఁచె భార్గవు
తనువున మనసున నితాంత తాపము గలుగున్. 482

కమలనగీతి.
ధనువుఁబూను రామచంద్రుదర్ళనంబు చేయఁ
జనిరి సర్వదేవతలును జలజసంభవుండు
ధవునుఁబూని రాఘవుండు దానిగొనము చేత
నినిచి జ్యానినాదమునను వించె సర్వధాత్రి. 483
శా.
నృత్యన్మంజుల తారహార కబరీనిష్యంది ముక్తామణి
ప్రత్యగ్రప్రసవాక్షి సంకలన దీవ్యత్కంధరా భేద సా

హిత్య ప్రౌఢనవాప్సరోనటన సౌహిత్యప్రశస్తాచ్ఛదృ

గ్గీత్యాకార మనోజ్ఞ మై ధనువు మ్రోగెన్ సర్వలోకంబులన్
. 484
వ.
అంత శ్రీరామచంద్రుండు బాణంబు సంధించి భార్గవుంజూచి-

0 comments

Aug 9, 2009

తాళ ప్రమాణమౌ తనుయష్టి కలవాఁడు జలధినుర్వులువోని జడలవాఁడు

ధనుష్ఖండము
పరశురామ గర్వభంగం

తాళ ప్రమాణమౌ తనుయష్టి కలవాఁడు

జలధినుర్వులువోని జడలవాఁడు

అఖిలాంగములను రుద్రాక్షముల్ కలవాఁడు

కాంతిపిండుల యెఱ్ఱకనులవాఁడు

ఫాలభాగంబున బ్రహ్మతేజమువాఁడు

చేతులం దాయుధశ్రీఁ గలాఁడు

కైలాసమునువోలెఁ గదలించరానివాఁ

డఖిలసంహారకాలాగ్నివోలె

గీ.
దుస్సహంబైనవాఁడు విద్యుద్గణోప
మక బయిన ఛాపధృతివాఁడు మహితమైన

తేజమునఁ గన్ను లొలయించి తేరి చూడ

రానివాఁడు వచ్చెఁ బరశురామమూర్తి.
402

పరశురాముడు శివధనుర్భంగాన్ని గుఱించి తెలిసికొన్నవాడై జనకుని ఆస్థానానికి వచ్చాడట. (మూలంలో దశరథాదులు సీతారాములతో అయోధ్యకు తిరిగి వెళ్ళేదారిలో పరశురాముడు తారసపడతాడు.) అప్పుడు వర్ణించిన పరశురాముని రూపం ఇది.
గీ.
అని విజృంభించు భృగురాము నంజలించి
రాముఁడను మీరు భార్గవరాము లగుట

దెలియవచ్చెను దాశరథిని రఘుకుల

రాముఁడను మౌనికులచంద్ర ! ప్రాంజలింతు.
414
మధ్యాక్కర.
ఎవ్వఁడు ప్రమథులనేత హేరంబు హ్రీకారి యయ్యె
నెవ్వనికతమున స్వామి దృక్తతి యింతగా విచ్చె

నెవ్వఁడు శివఫాల విధృతిహేతువై యెగసెనో వాఁడు

క్రొవ్వి శివద్రోహపథము కొన్నట్టి కోడీఁడు నేను. 415

అని రాముడు పరశురామునికి సమాధానమిస్తాడు. అప్పుడు పరశురాముడు రామునితో--
సీ.
నీవటోయీ యోయి ! నెట్టికసీల ! నీ
వా ? శైవధనుసును వంచినావు
నీ తాకినంతనా ? నిగుడు రుద్రధనుస్సు
వెదురుబద్దయుఁ బోలె విఱిగిపోయె
నేలాగు విఱిగెనో నీలకంధరు మహా
ధనువు చెప్పుము నేను వినవలతును
బనిపూని విఱిచితివా ! తాఁకినంతనే
విఱిగెనా; మంజూష వెలికిఁ దీసి
గీ.
పూనితివ ? యెక్కు బెట్టితివా ? నితాంత
యైన జ్యావల్లి సంధితమైనదా ? యె
దీ ! కథారీతిఁ జెప్పుము తిగిచినట్టి
యమ్ము నే లక్ష్యమును దాఁకి వమ్ము చేసె.418
వ.
అనిన శ్రీ రామచంద్రుం డిట్లనియె. 419
మధ్యాక్కర.
చేతిలోఁ బూని జ్యాకోటిఁ జెందింపఁ జెట్టంతవిల్లు
చేతిలో నొదుగునా ? లక్ష్యసిద్ధి కజిహ్మగ మెత్తు
టే తీరు? మంజూషనే రహించిన యీ పెద్దవిల్లు
చేత లాగితిని గాబోలు చేతిలో ఛిన్నమై విఱిగె. 420
క.
ఆమాటవించు భార్గవుఁ
డేమీ ! యేమీ ! కపాలభృద్ధనువున నీ
కేమి నిరాదృతి? నీవా
స్వామి ధనుసు చూచునంతకు పాటికి లేదా? 421

సీ.
చూడనే లేదు మంజూషలోపలి విల్లు
పాణిపద్మంబులఁ బట్టలేదు
సంధింపనేలేదు శరము లక్ష్యమెలేదు
తీసి కర్ణముదాఁకఁ దివియలేదు
విల్లేమొ ముక్కలై విఱిగిన దేమి లో
కాద్భుత కర్మము నాచరించి
తిది యచింత్యమ్ము సుమ్మీ ! బాలకాకుత్థ్స!
నీ వీర్యము జగత్రయీవిభేది
గీ.
యందుకనియే జగమ్మున నాడినట్టి
యాతఁ డాడక యాడెడు నద్భుతమగు
త్వన్మహాబలశాలిత తగును తగును
రాఘవా! నేత్రగోళ తర్పణమ వీవు. 422
శా.
ప్రాఁజీరంబలె విచ్చిపోయెను ధనూరాజంబు మంజూషలో
గోఁజాడం బనిలేదు వేఱ ధనువున్ ఘోరంబు నేఁ దెచ్చితిన్
నేఁ జెల్లా యిది యెక్కు వెట్టి శరమున్ నింపన్ వలెన్ నించినన్
నేఁ జూతున్ భవదీయ శౌర్యవిభవానేక క్రియావైఖరుల్. 423
క.
అప్పుడు వీర్యశాఘ్యున
కొప్పుగ నే ద్వంద్వయుద్ధ మొసఁగెద నీకున్
దెప్పరము ధనువు గుణమును
గొప్పున సంధించి యమ్ముఁ గూర్చి విడువుమీ. 424

0 comments

Aug 3, 2009

గౌరవంబు గల యింటి కగు నాఁడుపడుచు రాక యెంత సోభాయమానమో

రామాయణ కల్పవృక్షం-ధనుష్ఖండము
దశరథాదులు మిథిలకుఁ బ్రయాణమగుట
గీ.
గాఁగను బ్రయాణసన్నాహ కలితవేగ
రమ్యముఖులైరి నాల్గువర్ణములవారు
నంతిపురమునఁ బురమున నంగనలకు
నే మడతఁ దీయవలెనో యెఱుఁగరాదు. 338

మన తెలుగు ఆడపడుచుల మనస్తత్త్వమును ఎంతబాగా చెప్పారో చూడండి.
శాంతాదేవి కూడా మిథిలకు ప్రయాణమై వచ్చినపుడు కౌసల్య ఆమెతో ఎలా మాటాడిందో చూడండి.
వ.
అంతఁ గౌసల్యవచ్చి శాంతం గౌఁగిలించుకొని ముద్దాడి "తల్లీ నీవు వచ్చితివి; నా బరువు తీరినది; మాడుపట్టున నింతచమురుపెట్టుటకు మంగళహారతిపళ్ళెము పట్టుటకుఁ దమ్ముని దిద్దికొనుటకు నాఁడుపడుచవు వచ్చితి వని" పొంగిపోయె.
గీ.
శాంత కనుసన్నలంబడి సర్వమందు
సాధువు బ్రియంబునై యాజ్ఞ సాగె గౌర
వంబు గల యింటి కగు నాఁడుపడుచు రాక
యెంత సోభాయమానమో యెఱుఁగఁబడుచు. 354

తెలుగుదనాన్ని విశ్వనాథవారు రామాయణగాథలోనికెంత అందంగా ప్రవేశపెట్టారో చూసి మనమందరం మురుసుకోవాల్సివుంది.
సీరధ్వజుడు సుదాముడనే మంత్రిని దశరథుని కుమారులతో సహా అక్కడకు ఆహ్వానించమని పంపుతాడు.
అప్పుడు సుదాముడు
మ.
గురువుల్ మంత్రులతో సభాస్థలమునన్ గూర్చుండి నీపుత్త్రులున్
గురువుల్ నీవును రండటంచుఁ బిలిచెన్ క్షోణీశ ! వై దేహుఁడం
చురువౌ ప్రేమ సుదామనుండు వలుకన్ బ్రోద్దామ సమ్మోద ని
ర్భరుఁడై కోసలరాజు వచ్చితిమయా వైదేహునాస్థానికిన్. 382
గీ.
అని సబాంధవుఁడై నృపుఁ డరుగుదెంచె
నంతనంత సోపాధ్యాయుఁ డరుగుదెంచె
నంత నంత సపుత్త్రకుఁ డరుగుదెంచె
నంతలోన వియ్యంకుఁడై యరుగుదెంచె. 383

అనుప్రాసను ఎంతందంగా వాడారో ---

0 comments

Jul 31, 2009

నృత్యన్మంజుల తారహార కబరీనిష్యంది ముక్తామణి

రాముడు శివధనుర్భంగము చేయుట/పరశురామ గర్వభంగము

శివధనువు విఱిగిన ధ్వనిని గూర్చి వివరిస్తూ విశ్వనాథ వారు ఓ ఐదు అందమైన శార్దూల పద్యాలను వ్రాసారు. నాకీ పద్యాలు పూర్తిగా అర్థం కాలేదు. అయినా అంత అందమైన పద్యాలను బ్లాగీకరించకుండా ఉండటం నాకు సాధ్యం కాలేదు. విశ్వనాథవారు తరువాత ధనుష్ఖండంలోనే పరశురామ గర్వభంగం ఘట్టంలో ఇవే పద్యాలను (కొద్ది కొద్ది మార్పులతో) మళ్ళీ చెప్పటం జరిగింది. ఆ పద్యాలను కూడా ఈ పద్యాలక్రిందనే ఉదాహరిస్తున్నాను. మొదటి, తరువాతి పద్యాల వరుస సంఖ్యలను కూడా ప్రక్కనే వ్రాసాను.

వాల్మీకి రామాయణంలో ఈ శివధనుస్సు విరిగినప్పటి ధ్వని వర్ణన ఉందా అని అనుమానం వచ్చింది. అది తెలియాలంటే వాల్మీకి రామాయణం చదవాలి. వాల్మీకి రామాయణం నా దగ్గర లేదు. దానిని సంపాదించినా కాని నాకు సంస్కృతం రాదు. మరెలాగ. అప్పుడు గోపీనాధ రామాణం వాల్మీకి రామాయాణాన్ననుసరించి వ్రాసారన్నది గుర్తొచ్చింది. ఆ పుస్తకం నా దగ్గరుంది కాబట్టి తీసి ఆ ఘట్టం చదివా. అక్కడ ఉన్న 3 పద్యాలు ఇవి.
తే.
ఆ రఘుస్వామి సత్త్వ మే మనఁగ వచ్చుఁ
బగిలి పేడెత్తి జగములు పల్లటిల్లఁ
గరికరాహతి విఱిగిన చెఱకువోలె
ఘనరవంబునఁ దచ్ఛరాసనము విఱిగె. 1202
చ.
విఱిగెఁ గులాచలంబు లట బీఁటలు వాఱె దిగంతకుడ్యముల్
పఱియలు వాఱె భూతల మపాన్నిధులుం గలఁగెన్ వెసన్ దిశా
కరులు వడంకె భూతతతి గందెఁ గుశాన్వయుఁ డావిదేహదా
శరథులుఁ దక్క సర్వజనసంఘము మూర్ఛ మునింగె నత్తఱిన్. 1203
ఆ.
అంతఁ గొంతవడికి నమ్మహాశబ్దంబు, శాంతి నొందెఁ బిదప సభ్యులెల్ల
మూర్ఛ దేఱి చాల మోదంబు నొందిరి, జనకవిభుఁడు సాధ్వసంబు విడిచె. 1204

ఇంత మాత్రమే ఉంది. తరువాత విష్ణు ధనుష్టంకారశబ్దం గురించి ఏమీ లేదు. కాని విశ్వనాథ వారు వారి కల్పనను ఊహాశక్తిని జోడించి కడు హృద్యంగా ఈ ఘట్టాల్ని నడిపించారు.
అంటే ఇదంతా విశ్వనాథవారి స్వకపోల కల్పనే అనేది తెలిసి నిజంగా ఆశ్చర్య పోయాను.విశ్వనాథవారి కల్పనాశక్తికి ముగ్ధుడిని అయ్యాను. ఈ పద్యాల పూర్తి అర్థం తెలుసుకోవాలనే కోరికతో వాటిని క్రింద ఉదాహరిస్తున్నాను. చిత్తగించండి. పెద్దలెవరైనా ఈ పద్యాలకు ప్రతిపదార్థంతో వివరణ తెలియపరిస్తే వారికి కృతజ్ఞుడనై ఉంటాను.
శివధనుర్భంగం జరిగిన వెంటనే విశ్వనాథ వారు వ్రాసిన మొదటి పద్యం ఇది.
శా
.
నిష్ఠావర్ష దమోఘ మేఘపటలీ నిర్గచ్ఛదుద్యోతిత
స్పేష్ఠేరమ్మదమాలికా యుగప దుజ్జృంభన్మహా ఘోరబం

హిష్ఠ స్ఫూర్జధుషండమండిత రవాహీన క్రియా ప్రౌఢి ద్రా

ఘ్రిష్ఠంబై యొకరావ మంతట నెసంగెన్ ఛిన్న చాపంబునన్
. 303

ఛిన్నమైన శివుని చాపం నుండి వెలువడిన రావము(శబ్దం) గుఱించి వ్రాసిన పద్యం ఇది.ఇదే పద్యం కొద్ది మార్పులతో పరశురాముఁడు శివధనుర్భంగమునకుఁ గోపించి జనకుని సభకు వచ్చిన ఘట్టంలోని మొదటి పద్యం గా వారు వ్రాసారు. కాని మూలం ప్రకారం పరశురాముఁడు దశరథాదులు సీతారాములతో అయోధ్యకు తిరిగి వెళ్ళే దారిలో వస్తాడు కాని జనకుని సభలోనికి రాడు. ఆయన వచ్చేటప్పుడు వాకిట్లో శబ్దం ఘోరమై వినపడిందన్నారు. ఇది విష్ణుచాపధ్వని.
శా.
నిష్ఠావర్ష దురార మేఘపటలీ నిర్గచ్ఛదుద్యోతిత
స్పేష్ఠేరమ్మద మాలికా యుగపదుజ్జృంభ న్మహాఘోరబం

హిష్ఠ స్ఫూర్జధు షండమండల రవా హీనక్రియాప్రౌఢి ద్రా

ఘ్రిష్ఠమ్మై యొకరావ మంతట నెసంగెన్ వాకిటన్ ఘోరమై. 398


ఇక రెండో పద్యం.
శా.
హేరంబోన్నత శూర్పకర్ణ వివర హ్రీకారియై షణ్ముఖ
స్ఫార ద్వాదశ నేత్ర గోళవివృతి ప్రాకారమై శైల క

న్యారాజన్నవ ఫాలమండల విభుఘ్న క్రీడయై యాశ్ల

ద్గీరుగ్రప్రమథంబుగా ధనువు మ్రోఁగెన్ శైవలోకంబులన్
. 304

ఈ రెండో పద్యం పరశురాముని రాకకు ముందే బాలరాఘవు శివధనుర్భంగరవము దిగ్దిగంతములందుఁ బ్రతిధ్వనించె అంటూ చెప్పిన ఘట్టంలోనిది.
శా.
హేరంబోజ్జ్వల శూర్పకర్ణ వివరహ్రీకారియై షణ్ముఖ
స్ఫార ద్వాదశ నేత్రగోళ వివృతి ప్రాకారమై శైలక

న్యారాజన్నవఫాలమండల విభుగ్నక్రీడమై యాశ్చల

ద్గీరుగ్రప్రమథంబుగా నగుచు మ్రోఁగెన్ శైవలోకంబులన్. 390


పై రెండు పద్యాలలోను స్వల్పమైన మార్పులను గమనించండి.
తరువాతది మూడో పద్యం.
శా.
నృత్యన్మంజుల తారహార కబరీనిష్యంది ముక్తామణి
ప్రత్యగ్రప్రసవా క్షిసంకలనదీవ్యత్కంథ రాభేద సా

హిత్య ప్రౌఢ నవాప్సరోనటన సౌహిత్యప్రశస్తాచ్ఛదృ

గ్గీత్యాకారమనోజ్ఞమై ధనువు మ్రోగెన్ సర్వలోకంబులన్
. 305

ఈ పద్యం పరశురాముని నుండి రాముడు విష్ణుధనువుని తీసుకొని జ్యానినాదం చేసినపుడు దాని ధ్వనిని గుఱించి వ్రాసినది.
శా
.
నృత్యన్మంజుల తారహార కబరీనిష్యంది ముక్తామణి
ప్రత్యగ్రప్రసవాక్షి సంకలన దీవ్యత్కంధరా భేద సా

హిత్య ప్రౌఢనవాప్సరోనటన సౌహిత్యప్రశస్తాచ్ఛదృ

గ్గీత్యాకార మనోజ్ఞ మై ధనువు మ్రోగెన్ సర్వలోకంబులన్
. 484


తరువాతది నాల్గవ పద్యం.
శా
.
దర్పస్వీకృతహాస విశ్లథనరుంద్దుష్టవాగ్ధోరణీ
సర్పద్వీరచమూ పథశ్లథనమై స్రంసత్కటీ శాటికా

కూర్పాస ప్రకటోగ్ర సాధ్వసవధూగుర్విణ్య భద్రాధ్వమై

దర్పాడంబరమై ధనుస్సు మొఱసెన్ దైతేయలోకంబులన్
.306

ఈ పద్యం అధ్యాయంలోని చివరి పద్యం. శైవ వైష్ణవ చాపాల ధ్వనిని గురించి వ్రాసినది.
శా.
దర్పస్వీకృతహాస సంశ్లథన రుంధద్దుష్టవాగ్ధోరణీ
సర్ప ద్వీరచమూపథ శ్ల థనమై స్రంసత్క టీ శాటికా

కూర్పాస ప్రకటోగ్ర సాధ్వ సవధూగుర్విణ్యభద్రాధ్వమై

దర్పాడంబరమై ధనుస్సు మొఱసెన్ దైతేయలోకంబులన్
.507

చివదిదైన ఐదవ పద్యం.
శా.
స్ఫీ తాష్టాపదవిద్యుదుజ్జ్వల పయఃపీయుషధారాధునీ
నీతాస్వాద్యతర ప్రగల్భవచన స్నిగ్ధాననాంభోజ సం

ధా తీర్థాకృతి మాగధోల్భణము నానామేదినీరాట్సభా

గీతిస్వాదు మనోజ్ఞ మై ధనువు మ్రోగెన్ రాజలోకంబులన్
. 307

సీతారామ కల్యాణానికి ముందురోజు చెప్పిన చివరి పద్యం ఇది.
శా
.
స్ఫీ తాష్టాపద విద్యుదుజ్జ్వల పయఃపీయుష ధారాధునీ
నీతాస్వాద్యతర ప్రగల్భ వచన స్నిగ్ధాననాంభోజ సం

ధాతీర్థాకృతిమాగధోల్భణము నానామేదినీరాట్సభా

గీతిస్వాదుమనోజ్ఞ మై ధనువు మ్రోగెన్ రాజలోకంబులన్. 376


భైరవభట్ల కామేశ్వరరావు గారు, తాడేపల్లి గారు,రాఘవ గారు, ఇంకా ఆచార్య ఫణీంద్ర గారు మొదలైన పెద్దలెవరైనా నా సహాయానికి రాగలరని పై పద్యాలకు అర్థవివరణ చేసి నాకానందం కలిగిస్తారని ఆశిస్తూ ఈ టపా నిక్కడతో ముగిస్తున్నాను.

1 comments

Jul 27, 2009

శ్రీరఘురామచంద్రునకుఁ జిత్తము జానకిపైఁ గరంబు వి

రాముఁడు శివధనుర్భంగము చేయుట
క.
మీ యిష్టము తెప్పించితి
నాయుష్మంతులను చూడమనవే ! యన గా
ధేయుఁడు రాముని గాంచె వి
ధేయుఁడు రాముండు నేత్ర దీధితు లేచెన్. 294

గాధేయుడు శివధనుస్సును గురించిన వివరాలను జనకుని నుండి వినిన తరువాత ఆ ధనువును తెప్పించమని కోరగా జనకుడు దానిని సభకు తెప్పించి పై విధంగా అంటాడు. విశ్వామిత్రుడు సాభిప్రాయంగా రామునివంక చూడగా రాముడు లేచి ధనువు వద్దకు రా సాగెను.
గీ.
రామచంద్రుఁడు ధనువు చేరంగఁబోయి
తెఱచి మంజూష ధనువుపై దృష్టిపఱపి
కౌశికునివంకఁజూచి ప్రకాశమాన
మందహాసాభిరామాస్యమండలుండు. 295

రాముడు ధనువును చేరి పెట్టెను తెఱచి ధనువుపై దృష్టినుంచి గాధేయునివంక చూచి చిఱునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు.
క.
ఇది మొదలు తాఁకెదన యె
త్తుదునో పయి నెక్కు పెట్టుదునొ యత్నింతున్
ముదల; యనిన గాధేయుఁడు
సదమల రఘువంశ జలధిచంద్రమ ! రామా ! 296

మొదలు దీనిని తాకి చూస్తాను. తఱువాత ఎత్తుతానో ఆపైన యెక్కుపెడతానో ప్రయత్నం చేస్తాను . ఆజ్ఞ దయచేయండి.
అనగా గాధేయుడు స్వచ్ఛమైన రఘవంశమనే సముద్రానికి చందమామ వంటి వాడవైన ఓ రామా!
గీ.
తాటకాప్రాణపథ నిరాఘాటమూర్తి
కోటిమారీచధునన బాహాటశక్తి
క్షుద్రదైతేయకోటిసంస్ఫోటభయద
తాఁకవే యింతయే చాలు ధనువునకును. 297

గాధేయుడు రామునకు ధనువును తాకటానికి అనుజ్ఞను దయచేసాడు. ధనువును తాకవే అదే చాలు అన్నాడాయన.
వ.
అని విశ్వామిత్రుఁడనినంత శ్రీరామచంద్రుండు తత్సభాభవననివిష్ట ప్రాగ్దిశా సౌధంబు పై యంస్తున నంతఃపురస్త్రీల కదలిక గుర్తుపట్టి తలయెత్తిన- 298

అలా విశ్వామిత్రుడు అంటున్నప్పుడు ఆ సభాభవన పై అంతస్తు నందు అంతఃపురస్త్రీల కదలికను గమనించాడు రాముడు.
సీ.
ఇద మిత్థ మని నిర్ణయింపఁగా రాని దే
కోర్కి యో రూపుఁ గై కొన్నయట్లు
జన్మజన్మాంతర సంగతమ్మైన యా
శాబలం బవధికి సాగినట్లు
ప్రాణముల్ బయటికివచ్చి ముగ్ధాకార
మెనయించి దర్శన మిచ్చినట్లు
తనసృష్టిలోని యుత్తమభావ మానంద
ముగఁ బొంగి బింబమై పొడిచినట్టు
గీ.
లల యరుంధతియును నహల్యయును గోస
లాత్మజయు మువ్వురి యాననముల
కన్నను బవిత్రమగుచు శృంగారభావ
మొడిసిపట్టిన ముఖచంద్రుఁ డొకఁడుతోఁచె. 299

ఆ పైఅంతస్తునందు రామునికి ప్రప్రథమంగా సీతా దర్శనం కలిగింది.

ఇదమిత్థమని నిర్ణయించలేని ఏదో ఒక కోరిక రూపు కట్టినట్లుగాను, జన్మజన్మాంతర సంబంధ మేదో ఆశాబలాన్ని తుదముట్టేవరకూ సాగినట్లుగాను, ప్రాణాలు బయటికి వచ్చి ముగ్ధాకారాన్ని సరిపోల్చి దర్శన మిచ్చినట్లుగాను, సృష్టిలోని ఉత్తమభావమంతా ఆనందంగా పొంగి ఒక బింబంగా మారి కనిపించినట్లుగాను, యరుంధతి అహల్య కౌసల్యల ముగ్గురి మోములకంటె పవిత్రమైనదీ, శృంగారభావాన్ని ఒడిసిపట్టినదీ అయిన ఒక ముఖచంద్రుని(సీతాదేవి) దర్శనమయ్యిందట.
ఉ.
శ్రీరఘురామచంద్రునకుఁ జిత్తము జానకిపైఁ గరంబు వి
స్ఫార శరాస లస్తకముపై యుగపత్క్రియఁ జిత్రమయ్యె సం
ధారతిఁ గోటికెక్కిన గుణంబు బిగించుట లాగు టింతయున్
నేరఁడెఱుంగ నొక్కసడి నిండిన శబ్దము కల్గు నంతకున్. 301

రామునికి సీతయందు మనస్సెంతగా లగ్నమయ్యిందంటే నారిని వింటికొనకు తగిలించటం కాని నారి సారించటం గాని తెలుసుకోలేకపోయాడు ఒక్కసారిగా విల్లువిఱిగిన శబ్దమయిందంతే.
సీ.
మంజూషలోనె యమర్చి కోణంబందు
నొక్కి త్రాటం గొప్పు నెక్కు వెట్టెఁ
గాఁబోలు మంజూషికా వినిర్గమనంబు
వేళకే జ్యావల్లి బిగిసియుండెఁ
దాళప్రమాణమౌ ధనువు జానకిదృష్టి
కడ్డమ్ముగా వచ్చునంచు నెంచెఁ
గాఁబోలు నడ్డంబుగా ధనుస్సును బూని
పిడిబాకువలెఁ ద్రాడు వ్రీలలాగె
గీ.
నతని దృష్టికి జానకి యాఁగలేదు
అతని కృష్టికి శివధను స్సాఁగలేదు
సీత పూజడ వెన్నుగా శిరసు వంచెఁ
జెరుకుగడవోలె నడిమికి విఱిగె ధనువు. 302

పెట్టెలోనే అమర్చికొని కోణాన్నినొక్కిపట్టి నారిని కొప్పుకు ఎక్కుపెట్టాడు కాబోలు పెట్టెనుండి బయట పడేసరికే నారి విల్లుకు బిగించబడి వుంది. తాటిచెట్టంత పొడవైన ధనువు జానకినిచూచే తన దృష్టికి అడ్డంగా వుందని అనుకున్నాడు కాబోలు అడ్డంగా ధనువును పట్టుకుని పిడిబాకును ఒరలోనుండి బయటకు లాగిన విధంగా నారిని బాగా లాగాడు.
అతని దృష్టికి జానకి ఆగలేదు, అతని దుక్కికి శవధనుస్సాగలేదు. సీత తన పూజడ వెన్నువెంట వచ్చేట్లుగా తన శిరసును వంచుకున్నది. చెఱకుగడ వలె ధనుస్సు మధ్యకి రెండుగా విఱిగింది.
ఇదే ఘట్టాన్ని ఇంకా ఎంతో అందంగా మా గురువుగారు భైరవభట్ల కామేశ్వరరావు గారు తన బ్లాగులో వ్రాసినట్లు గుర్తు.
ఆ ఎడ్రసు నాకిప్పుడు దొరకలేదు.

0 comments

Jul 25, 2009

రఘుపులకోవ క్షీరధిచందమామకు వింటి కోసలయందు విజయ మగుత

శ్రీరామాయణ కల్పవృక్షము-ధనుష్ఖండము
సీ.
రఘుపులకోవ క్షీరధిచందమామకు
వింటి కోసలయందు విజయ మగుత
కౌసల్యబిడ్డకుఁ గన్నతండ్రికి విదే
హాధీశుసభలఁ గళ్యాణ మగుత
తాటకాప్రాణసంతాపన ద్విజిహ్వున
కఖిల మార్గమునందు నభయ మగుత
యఖలేశ్వరున కహల్యాప్రాణదాతకుఁ
ద్రిభువనంబులయందు శుభము లగుత
గీ.
గౌతమర్షి తేజము గూఁడుకట్టియున్న
యీ యహల్య ప్రాణములలో నెగయుచున్న
శ్రద్ధలును భక్తులును బరిస్పందములును
దండ్రి వెన్నాడి శుభములు తార్చుగాత. 2

సీ.
ఓ యమ్మ భూదేవి ! యీ యయ్య రఘుశిశు
బడలఁ బెట్టకు మమ్మ యడుగులందు
ఓ వాయుదేవ ! రఘూద్వహు శ్రీరాముఁ
జొక్కి పోకుండంగఁ జూడుమయ్య
ఓసి తేజోభూతమా ! సామి తేజమ్ము
బొడ్డు దీధితులను బొక్కనీకు
ఓ యగ్ని ! యీ కౌసలేయుండు పసిపాప
కడలనాల్గింటను బాచియుండు
గీ.
ఓ జలాధి దేవతలార ! రాజశిశివు
నీ రసాధిదేవత చూడుఁడీ ! సమస్త
రసపథంబులయందున రాపులేక
స్వామి మిథిలేశు సభలకు సాగుచుండె. 4

రామలక్ష్మణులు అహల్యా శాపవిమోచనానంతరము విశ్వామిత్రునితో కలసి మిథిలేశు నగరానికి ప్రయాణమై వెళ్ళుతున్నారు. అహల్యాదేవి వారికి వీడుకోలు పలుకుతున్నది.
సీ.
నా ప్రేమ యిద్ది యెన్నాళ్ళిట్టులే యుండుఁ
గదలిపోవయ్య రాఘవకులేంద్ర !
ఎన్నాళ్ళు తిలకంబు నిట్టె దీర్చుచునుందు
మునులు వేచెదరయ్య ముద్దుబిడ్డ
ఈ సాగనంపుట కెప్పు డంతుండదు
వహ్ను లెత్తిరి సుమీ బండ్లపైని
నా వ్రేలి యెఱ్ఱదనాలకుంకుమ యార
దా విదేహముల కీ వరుగవలయు
గీ.
నాయనా ! యచ్చటను శతానందుఁ డుండె
నీవు నా బిడ్డ వగుట వానికిని జెప్పు
నీవు నా తండ్రి వగుట వానికి వచింపు
నీవు నా దైవ మగుట వానికిని దెలుపు. 6

అదీ విశ్వనాథ వారి శైలి.
మ.
అల వైదేహియు శ్రీయుఁ గాఁదిరిగి పోనౌ వేళఁ గళ్యాణమూ
ర్తులు మీ జంటలు గౌతమాశ్రమముగాఁ ద్రోవం జనంజూడుఁడీ
శిలయౌ నొక్కతె వేచియుండు నిట రాజీవాక్ష ! మీకోసమై
యలరుం భక్తియె పేని చీర లవి మీకై కట్టబెట్టంగ నై.7

0 comments

Jul 24, 2009

తాటకావధంబునకును బారితోషికము పొందు మొసంగెద రాఘవా !

తాటక సంహారానంతరము దేవతలు విశ్వామిత్రుని వద్దకు వచ్చి భృశాశ్వవిద్యలను రామున కొసగమని కోరుతారు. విశ్వామిత్రు డలానే వారి కావిద్యలను ప్రసాదిస్తాడు.
చ.
చన జలదేశ మొండయిన సన్ముని యంతటఁ దాటకావధం
బునకును బారితోషికము పొందు మొసంగెద రాఘవా ! జలం
బును స్పృశియింపుమన్న రఘుమూర్తి స్పృశించెను నంతమౌని లో
చనములు కోటిసూర్యసదృశంబుగఁ దైజసమూర్తులొప్పఁగా. 159
వ.
మహాదివ్యంబులైన దండచక్ర కాలచక్ర ధర్మచక్ర విష్ణుచక్రంబులు నైంద్రవజ్రంబులు శైవంబయిన శూలంబునుబ్రహ్మశిరంబును నైషీకంబును బ్రహ్మాస్త్రంబును మోదకీ శిఖరీనామ గదాద్వయంబు ధర్మకాల వారుణ పాశంబులు శుష్కార్ద్రములును నశనులుఁ బైనాక నారాయణాస్త్రంబులు శిఖరమన్న యాగ్నేయా స్త్రంబును బ్రథమన్న వాయవ్యంబును హరశిరః క్రౌంచాస్త్రంబులును శక్తి ద్వయంబును నసురులు ధరించు కంకాళ ముసల కపాల కంకణా స్త్రంబులును వైద్యాధరాస్త్రంబు నందకాసి గాంధర్వమానవ ప్రస్వాపన ప్రశమన సౌరదర్పణ శోషణ సంతాపన విలాపనా స్త్రంబులును గందర్ప దయితంబును దైవదుర్ధర్ష మదనంబును బైశాచ దయితమ్మైన మోహనంబును సంవర్తదుర్ధర్ష మోసలమ్ములును సత్యాస్త్రంబును బరతేజో2పకర్షకం బైన మాయాధర్మమునుతేజఃప్రభాస్త్రంబును శిశిరంబను సోమాస్త్రంబును సుదామనంబను త్వష్టయస్త్రమ్మును భగుని ధారుణంబును శీతేషువును మానవాస్త్రంబును గామరూపంబులు మహాబలంబులు మరమోదారంబులు తేజోమూర్తులై కన్నులయెదుటఁ దిరిగిన- 159
ఆ.
సరగ వేని సర్వసంగ్రణంబు దై
వములకే నశక్యఫణితి యగునొ
యవియు గుంపుగాఁగ నరుదెంచి రాముని
యెదుట మోకరించి యిట్టు లనియె. 160
క.
పరమోదారులమును గిం
కరులము రఘునాథ ! మమ్ముఁ గైకొను మనినన్
దరణికులుఁడు శ్రద్ధామతి
గరమును నా మానసములుగా మెలఁగుడనెన్. 161

0 comments

ఇదె గోబ్రాహ్మణ రక్షకోసమయి యా యీ దేశసౌభాగ్యసంపదకై

తాటక వధ
విశ్వామిత్రుఁడు రామునితో తాటకిని వధించమని చెప్పినపుడు
మ.
అనినన్ రాముఁడు మీలితాక్షుఁడయి కట్టా ! యాఁడుదానిన్ వధిం
పను నా చేతికి నమ్మురాదనిన విశ్వామిత్రుఁడా దోష ముం
డిన నా యందున నుండు ధర్మమగు సంధింజూడు మట్లెంచ భూ
జనులిట్లే హతమారుచుండి రిటు లెంచన్ స్త్రీవధ క్లేశమున్. 131

విశ్వామిత్రుఁడు తాటకిని వధించమన్నప్పుడు రాముఁడు మీలితాక్షుడయి అయ్యో ! స్త్రీని వధించుటకు నాచేతికి బాణము రాదంటాడు. విశ్వామిత్రుఁడు ఆ దోషమేదయినా ఉంటే అది నాది. ఇలా స్త్రీవధ అనే క్లేశమును గుఱించి ఆలోచిస్తుంటే దానివలన అనేకమంది జనులు సంహరింపబడుతుంటారు. అంతేకాదు,
వ.
నృశంసుం డనృశంసుం డనక పాతకంబు సదోషం బనక సత్పురుషులు ప్రజారక్షణం బాచరింపవలయు; నిది సనాతనం బైన రాజధర్మంబు; ఇది పరమాధర్మురాలు; దీనింగూర్చి ధర్మవిచారణ లేదు; తొల్లి ధారణీదేవిఁ జంపబోవు మంథరను శక్రుండు వధించె, లోకంబనింద్రంబు జేయనెంచిన భృగుపత్నిని వెన్నుండు సంహరించె; అధర్మసహితలై స్త్రీలు తొల్లి మహా పురుషులచే వధింపఁబడిరి; ధర్మంబు మాకు వదలుము; నీప్రథమమార్గణదర్శనోత్సాహులము మాకుఁ గనువిందు సేయుము. 132
ఉ.
అల్ల భృశాశ్వునుండి సకలాస్త్రములున్ ననుఁ జేరె నస్త్రముల్
తల్లులు రెండునౌ నతిబలాబలలున్ నిను నన్ను నుండి శ్రీ
వల్లులు చేరె నేను గురువన్ గురుదక్షిణ యిమ్ము తాటకా
భల్లము నాకు రాఘవనృపాలక గేహమణి ప్రదీపికా ! 133

నేను నీకు గురువును. నీకు నా నుండి భృశాశ్వదత్తములు అస్త్రాలకెల్ల తల్లులు అనదగిన బల అతిబల అనే విద్యలు చేరినవి. నాకు గురుదక్షిణగా తాటకివధను చేయి. నీ ప్రతాపాన్నిచూడ ఉత్సాహపడుచున్నాము. మాకు కనువిందు చేయి అని అన్నాడు విశ్వామిత్రుడు.
మ.
అనినన్ రాముఁడు దోయిలించి ప్రభువా ! యట్లే పొనర్తున్ నినున్
నిను విద్యాగురు నేను గాదనుట లేనేలేదు; మా తండ్రులున్
ననుఁ బంపించెడు వేళ నీ వచనముల్ నానాత్రయీ మౌళిమం
డనముల్ గాఁగ సమాదరింపు మని యన్నారున్ మహః పేటికా ! 134

అలా అనగానే రాముడు దోసిలొగ్గి ప్రభూ అలాగే చేస్తాను నిన్ను నా విద్యాగురుని నేను కాదనుటన్నది లేనేనేదు. మా తండ్రిగారు సయితము మమ్ములను పంపించే టప్పుడు మీరు చెప్పిన పనిని వేదమంత్రములునుగా భావించి ఆచరించ మని చెప్పారు.
మ.
ఇదె గోబ్రాహ్మణ రక్షకోసమయి యా యీ దేశసౌభాగ్యసం
పదకై మద్గురు దక్షిణార్థమయి యీ పాపాత్మ యౌ తాటకన్
జదియింతున్ జదియింతు నంచును ధనుర్జ్యావల్లి శబ్దించినన్
హ్రద సేతుభ్రమ వారి నిస్వనముగా నార్చెన్ దిశాసంతతుల్. 135

ఇదె గోబ్రాహ్మణ రక్షకోసమయి యీ దేశసౌభాగ్యం కోసమై గురు దక్షిణ చెల్లించటం కోసమయి యీ పాపాత్మ అయిన తాటకిని వధిస్తాను అని అంటూ ధనుష్టంకారాన్ని చేసాడు రాఘవుడు.

తాటక వధ స్త్రీ హత్య. దానిని రాముడు చేసాడు గదా అని వాదించేవారికి సమాధానముగా విశ్వనాథవారు మంచి పకడ్బందీగా రామునిమీదకు నింద రాని విధంగా రాముడు ఎందుకు ఏ సందర్భంలో ఎలా దానినాచరించాడో వివరిస్తూ తెలియ చేసిన విధానం చాలా బాగా నచ్చింది నాకు.

రాముడు తాటకి కాలు సేతులు నరుకుతాడు ముందుగా , లక్ష్మణుడు ఆమె ముక్కుచెవులు కోస్తాడు. చివరాఖరికి శబ్దవేది విద్యను ప్రయోగించి రాముడు అదృశ్యరూపంలో ఉండి యుద్ధం చేస్తున్న తాటకిని సంహరిస్తాడు.




మ.

0 comments

Jul 22, 2009

కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే

SRI VENKATESWARA SUPRABHATAM IN TELUGU VIDEO


Hosted by eSnips
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్.


చివరికెలాగయితేనేం దశరథుడు రామలక్ష్మణులను విశ్వామిత్త్రునితో యాగరక్షణకై పంపిస్తాడు.
ఉ.
స్కందవిశాఖు లిద్దఱును స్థాణుని వెంబడి నేగినట్లు శ్రీ
స్యందిముఖాశ్వినేయులును సారసగర్భుని వెంట నేగి న
ట్లందపుఁబ్రోవులౌ దశరథాత్మజు లిద్దఱు గాధిసూతి వెం
టం దపనీయ పాద వికట స్ఫురణంబుల నేగఁజొచ్చినన్. 76

స్కందుడు విశాఖుడు ఈశ్వరుని వెనుక వెళ్లినట్లుగాను, శ్రీస్యందిముఖాశ్వినేయులు విష్ణుని వెనుక వెళ్ళినట్లుగా రామలక్ష్మణులిరువురూ విశ్వామిత్రమహర్షి వెనుక వెళ్ళారట. ఇక్కడ విశ్వనాథవారు వెనుకకుఁ దిరుగఁడు తఱుముచు అని మొదలయ్యే 4 వరుస కందపద్యాల్ని వ్రాసారు. అలా వారు ముగ్గురూ సాయంత్రం అయ్యేసరికి సరయూనది దక్షిణ తీరం చేరతారు. ఆ సాయం వేళలో సూర్యాస్తమయానికి ముందుగానే రామలక్ష్మణులకు బల అతిబల అనే రెండు విద్యలను నేర్పిస్తాడు. వీటి ప్రభావం వలన వారిని ఆకలి దప్పులు, జ్వరము మొదలగునవి బాధించవు. ఆ రాత్రికి వారు ముగ్గురూ అక్కడ నిద్ర చేస్తారు. వేకువనే విశ్వామిత్రుడు మేల్కని రామలక్ష్మణులను నిద్రలేపుతాడు.

తొలివెలుఁగయ్య నిదోయి ! యోయి ! యోకో
సల సుతప్రజ ! సాధు రామచంద్రా !
తొలివెలుఁగయ్య నిదోయి ! కౌసలేయా !
మెలకువ వచ్చెనె మీకు రామభద్రా !

లేచి దైవమైన యాహ్నికంబుఁ దీర్పుండనినఁ దల్లి పిలుపుకన్నఁ బ్రేమార్ద్రము మృదువు నైన మునిమాటకు మేల్కని ---
SRI VENKATESWARA SUPRABHATAM IN TELUGU VIDEO
Hosted by eSnips

0 comments

Jul 21, 2009

మొదట నిత్తు నంచుఁ బిదప నీకుండుట యశ్వమేఘయాగ హతము సేత

మ.
పసివాఁడే పసివాఁడు రాఘవుఁడు నా ప్రాణంబులోఁ బ్రాణ మా
నిసువుం గాంచఁగ బడ్డ కష్టములు తండ్రీ ! విస్మృతిం గాంచలే
నస లీ నాఁటికి నేను; నీ కరుణ కట్టా యెంతదూరమ్ముగా
మసలున్ ? వచ్చెనొలేదొ రామునకు శంస్యమ్ముల్ పదార్వర్షముల్. 48

రాముడు పసివాడే పసివాడు , నా ప్రాణంలో ప్రాణం, ఆ నిసువుని కనడానికి పడ్డ కష్టాలు ఇంకా మరచిపోలేకుండా వున్నాను. నీ కరుణ నా కెంత దూరం గా వుంది. రాముడికింకా నిండా పదహారేళ్ళొచ్చేయో లేదో కూడాను.
ఉ.
తా మమకారమే యనుము తక్కిన ముగ్గురొకెత్తు వాఁడొకె
త్తోముని ! నాకు ; వానివిడి యోర్వఁగఁజాలను గోసలేంద్ర క
న్యామణి యోర్వ దెవ్వ రెటులైనను గైకయు యోర్వఁజాలదా
రాముఁడు లేని నాదు గృహరాజియు జీఁకటికోణముల్ మునీ ! 49
ఉ.
పువ్వులఁ గొట్టినన్ సొలసిపోయెడు రాముఁడు యుద్ధభూమిలో
నెవ్వడు ? వాఁడు నేర్చినది యేమి మహాధనురస్త్రవిద్య ? యా
యెవ్వరు విఘ్నకృద్దిజు లెవ్వని పుత్రకు లేమివారు ! నే
జివ్వకు దూసి వారలను జెండుట కేమి యుపాయ మొప్పెడిన్. 53

అనగా విశ్వామిత్రుడు రావణాసురుడిని గురించి వాని బంధువులైన మారీచ సుబాహుల్ని గురించి వాళ్ళు తన యాగం పాడు చేయటం గురించీ చెప్తాడు. అది విని దశరథుడు రాముడిని పంపనంటాడు. అప్పుడు విశ్వామిత్రునికి కోపం వచ్చి
మ.
అవునయ్యా ! యవునిత్తు వంటి మొదలీ యంతంబునం దీయనం
టివి; పోనీ ! రఘువంశయోగ్యమగునో నీ చేఁత ! నీకున్ సుఖం
బవు నీ బంధులు నీవునున్ సుఖము పెల్లైయుండుఁ డేఁ బోదు మా
నవనాధా ! సుఖమౌత నీకును బ్రతిజ్ఞాభంగపుణ్యాబ్ధికిన్. 63

సుఖం అనే మాటని మూడుసార్లనిపించారు. ప్రతిజ్ఞాభంగపుణ్యాబ్ధికిన్ అనే మరో చురక కూడా.

ఇలా అని చెప్పి విశ్వామిత్రుడు వెలుపలి ద్వారం దాకా వచ్చేస్తాడు. విశ్వామిత్రుని కోపం తగ్గింపజేసి వానిని తిరిగి వెనుకకు రప్పించమని వశిష్ఠుల వారిని వేడుకుంటాడు దశరథుడు.
క.
వైకుంఠ మొత్తిగిలినను
వైకుంఠ మె యొడ్డుకొనఁగవలయును మోహ
వ్యాకులత చిత్తు నన్నున్
గైకో సాఁకంగ నీకుఁగా కెవరికయా ! 66
వశిష్ఠుల వారంటారప్పుడు.
ఆ.
మొదట నిత్తు నంచుఁ బిదప నీకుండుట
యశ్వమేఘయాగ హతము సేత
మొదట వాపిఁ ద్రవ్వి పిదపఁ బూడ్పించుట
యీవు ధర్మ మూర్తి విదియుఁ దగునె 68


0 comments

రాముఁడు నాకు స్నానమగు రాముఁడు నాకు జపంబు ధ్యానమున్

విశ్వామిత్రుడు రాముని యాగసంరక్షణార్థం పంపించవలసిందని దశరథుని కోరుట

చిత్తము చిత్తమంచు నృపశేఖరుఁ డాసమదాస్యహాసుఁ డై
యొత్తిగిలెన్ నిషణ్ణతను నొత్తిడిఁ జేసెను మౌని రాజు లో
నుత్తలమందుచున్ బ్రభు ! ప్రభూ ! బ్రతుకంతయు వాచి కన్న యీ
పొత్తులబిడ్డఁ బాయ నిలుపోపనయా ! నిముసంబు నేనియున్. 32

అలా విశ్వామిత్రుడు రాముడ్ని తనతో పంపించమని అడగ్గానే దశరథుడు ' చిత్తము ', ' చిత్తము ' అని అంటున్నాడే కాని ముఖంలో కత్తివాటుకు నెత్తురుచుక్క లేకుండా అయిపోయిన వాడై ప్రక్కకు ఒత్తిగిలగా విశ్వమిత్రుడు అతడిని తిరిగి తిరిగి ఒత్తిడి చేయసాగాడు. అప్పుడు రాజు కలతచెందుతూ ' ప్రభు ! ', ' ప్రభూ !' "బ్రతుకంతా వాచి కన్న యీ పొత్తుల బిడ్డని ఒక నిముషమైనా విడిచిపెట్టడాన్ని సహించలేనయ్యా." అన్నాడు.
రామాయణం అచ్చంగా తెలుగు నేలమీదే జరిగిందనిపించేలా విశ్వానాథ వారుపయోగించిన అచ్చమైన తెలుగు పలుకుల నుడికారపు చెణుకులు. బ్రతుకంతా వాచి కన్న పొత్తులలోని బిడ్డడట రాముడు నిముసం కూడా విడిచి ఉండలేడట. అంతేకాదు,
ఉ.
రాముఁడు నాకు స్నానమగు రాముఁడు నాకు జపంబు ధ్యానమున్
రాముఁడె యెల్ల నాబ్రతుకు రాముఁడు నన్నును గన్నతండ్రి యీ
రాము వినా నిమేష మవురా మన జాలను గాదయేని నీ
రామునివీడి యీ యఖిలరాజ్యము గాధిసుతా ! గ్రహింపవే ! 33

రాముడే నాకు స్నానం, రాముడే నాకు జపం, రాముడే నాకు ధ్యానం, నా బ్రతుకే రాముడు, నేనతడ్ని కన్నతండ్రిని కాదు, రాముడే నన్ను కన్నతండ్రి . అటువంటి ఈ రాముడ్ని విడిచి ఒక్క నిముషం కూడా నేను బ్రతికి బట్టకట్టలేను. అంచేత ఈ రాముడ్ని మటుకు విడిచిపెట్టి ఓ గాధిసుతా ! యీ అఖిల రాజ్యాన్నీ తీసేసుకోవయ్యా ! అన్నాడు దశరథుడు.
ఇదే పద్యాన్ని దశరథుడు కైకేయి రాముని వనవాసానికి పంపమని కోరినప్పుడుకూడా అంటాడు. అచ్చ తెనుగు నుడికారం. విశ్వనాథో నమో నమః.
మ.
వసుధేశుం డిటులన్న యంతటన విశ్వామిత్రు నాస్యోద్గతం
బసకృద్ధాసము చిళ్ళ చిళ్ళలయి రాజాంతఃపురం బంతటన్
ముసరెన్ మౌనియు నిట్లు చెప్పె బళిరా ! భూపాల ! నీవేదియై
న సరే యింతకుమున్న యిత్తునని యన్నావే కదా దాత వై. 34

దశరథ మహారాజీ విధంగా అనగానే విశ్వామిత్రుని ముఖం నుండి కోపం చిళ్ళ చిళ్ళలయి(ఎంత అందమైన ప్రయోగం) రాజాంతఃపురాన్ని అంతటనూ ముసరిపోయిందట. ముని ఈ విధంగా పలికాడట: భళిరా ! భూపాల ! నీవేదియైనా సరే యిస్తానని ఇంతకు ముందే కదా అన్నావు పెద్ద దాత లాగ ! అని అంటపొడుస్తున్నట్లుగా అన్నాడు విశ్వామిత్రుడు.
క.
నీ కొడుకును గైకొనిచని
మా కాఁకలి యంచుఁదిందుమా ? పిచ్చినృపా !
మాకడఁ బ్రశస్త మస్త్ర
వ్యాకృతి కలదద్ది నేర్పి పంపెద మింతే. 35

నీ కొడుకుని తీసుకుపోయి మాకు ఆకలన్చెప్పి తింటామా ఏమిటి ? పిచ్చి రాజా ! మా దగ్గఱ బోల్డన్నిప్రశస్తమయిన అస్త్రశస్త్రాలు పడి మూలుగుతున్నాయయ్యా ! వాటిని నేర్పి పంపిస్తామంతే.
ఉ.
ఇమ్మగు విద్య నేర్పెదము నింకను నాకొక చిన్నమెత్తు కా
ర్యమ్మును జేసిపెట్టవలె నాపయిఁ బూవులలోనఁ బెట్టి కై
కొమ్మని నీకుమారుఁ డిడుగో నని నీక యొసంగువార మా
పిమ్మట నీవుగా నతని వీడవలెన్ మఱి మాకు నేటికిన్. 36

యుక్తమైన విద్యలను అతనికి నేర్పిస్తాము. ఇంకా నాకో చిన్నమెత్తు పనికూడా చేసిపెట్టాల్సింది వుంది. ఆ పైన నీ కుమారుడిని పూవుల్లోపెట్టి నీ కుమారు డిడిగో తీసుకో అని చెప్పి మరీ నీ కప్పగిస్తామయ్యా. ఆ పైన నీవుగా నీవే అతడిని విడిచిపెట్టాలి కాని మాకు సంబంధం లేదయ్యా అన్నాడు గాధిసుతుడు. (అవును ఋషివాక్కు భవిష్యద్దర్శనం చేస్తున్నది రాముడు వనవాసానికి వెళ్ళాక దశరథుడు పరలోకగతుడౌతాడు). తనకున్న ఆ చిన్నమెత్తు పని ఏమిటో కూడా చెప్తున్నాడు.

1 comments

Jul 16, 2009

ఊరకే యనలము దాచుకొన్న ఫలమా ? క్రతు యోగ్యము కావలెం జుమీ !

విశ్వామిత్రుడు రాముడిని తనతో యజ్ఞసంరక్షణార్థము పంపమని కోరుట.

దశరథుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు.
క.
ఊరకయ వచ్చి యుందురు
కోరిక యొక్కండు నన్నుఁ గోరుఁడు నేనుం

దీఱిచెద జన్మసఫలతఁ

గూరిచికొన వచ్చినందుకున్ దీర్థమతుల్.
19

మీరు నా దగ్గరకు ఏమీ ఆశించకుండా ఊరికే వచ్చివుంటారు. కాని మీరు నన్నో కోరిక కోరుకోండి. నా జన్మ సాఫల్యమయ్యేట్టుగా నేను తీరుస్తానని కూడా అన్నాడు. ఇంకా ఇలా కూడా అన్నాడు.
క.
ఇది యడుగవచ్చుఁ గాదని
మది నెంచకుఁ డేదియైన మామక పుణ్యా

స్పదము హఠాస్స్ఫురితము నీ

వదనంబుననుండి రానె వలయును స్వామీ
.20

హఠాత్తుగా మీకేది తోస్తే అది అడిగెయ్యాలి సందేహం లేకుండా-అని కూడా రొక్కించాడు.

దానికి విశ్వామిత్రుడు
సీ.
పాప మెన్నేండ్లకో పడయఁజాలవు సంతు
తుదకేమొ రత్నపుఁ దునుక కలిగె

నే ముని యాశ్రమ మ్మేగిన నీ కుమా

రుని గూర్చియే చెప్పుకొనుచునుంద్రు

పసివానిఁ బొగడుట పాటిగా దైనను

నింతని నీ భాగ్య మెట్లు చెప్ప

నాపనిఁ జెప్పెద నాపైని ముందు నీ
సుతు రామభద్రుని జూడవలయుఁ

గీ.

గబురుపంపు మనంగ భూకాంతుఁ డంత
రామభద్రుని బిలిపించె రామభద్రుఁ

డరుగుదెంచెను లక్ష్మణుం డరుగు దెంచె

నతని వెంబడి వినయంబు లతిశయిల్ల. 24


పాపం ఎన్నాళ్ళకెన్నాళ్ళకో గాని నీకు సంతానం కలుగలేదు. చివరికేమో రత్నపు తునకే పుట్టింది నీకు. మేము ఏ ముని ఆశ్రమానికెళ్ళినా నీ కొడుకు గుణగణాలే వింటున్నాం. పసివాడిని - పొగడకూడదు కాని నీ భాగ్యం ఇంతటిది అని ఎలా చెప్పేది. నా పని తరువాత చెప్తాను , కాని ముందు రాముడ్ని చూడాలయ్యా కబురు పంపు అని అడగ్గా దశరథుడు రామభద్రుని పిలిపించాడు. రామునితో పాటుగా లక్ష్మణుడూ అక్కడకు వచ్చి ఇద్దరూ విశ్వామిత్ర మహర్షికి పాదాభివందనం చేస్తారు.
తరువాత
సీ.
గాధేయుచూపులు కమలపత్రాభిరా
మము లైన రామునేత్రములఁ గలియు
గాధేయుకన్నులు కదలి వశిష్ఠుల
స్తిమితనేత్రములను జేరఁబోవు
గాధేయు చూపులు కమనీయ రామ మే
ఘముమేన శంపాభకాంతు లొలయు
గాధేయు కన్నులు కదలి వశిష్ఠ శం
పాలోచనైక్యభావంబు నందు
గీ.
రామచంద్రుని మధురదర్శనములోన
నిరువురు మునీంద్రులును బ్రహ్మఋషిత గాధి
సుతునకు వశిష్ఠు లిచ్చిన శుభసమయము
నందుఁగన్నను నధికసౌహార్ద్రులైరి. 28

గాధేయు చూపులు, గాధేయు కన్నులు - అనే వాటిని రెండేసి సార్లు పునరిక్తమయ్యేలా విశ్వనాథ వారు ఇక్కడ సాభిప్రాయంగా ఉపయోగించారు.
గాధేయుని చూపులు మొదట కమలపత్రాభిరామములైన రామచంద్రుని నేత్రములను కలిసాయట. ఆ సుందర నేత్రాలను చూచిన తర్వాత అక్కడనుండి గాధేయుని కన్నులు వశిష్ఠుల స్థిమితమైన నేత్రాలను చేరబోయినవట.
తరువాత గాధేయు చూపులు అక్కడనుండి తిరిగి అందమైన రాము డనే మేఘము మేని మీదకు మెఱపుల కాంతులలా ప్రకాశించాయట. అక్కడనుండి కదలి గాధేయుని కన్నులు వశిష్ఠుని మెరిసే కన్నులతో ఐక్యమయ్యాయట. రామచంద్రుని దర్శనములో ఇరువురు మునీంద్రులు కూడా పూర్వం గాధేయుని బ్రహ్మర్షిగా వశిష్ఠులవారు అంగీకరించి కీర్తించిన సమయంలో కంటె ఎక్కువ సౌహార్దాన్ని పొందారట ఆసమయంలో. ఎంత చక్కనైన వర్ణన.

అప్పుడు విశ్వామిత్రుడు దశరథునితో తన కోరిక ఇలా తెలియజేసాడట.
మ.
ఎవరయ్యా ! రఘురామచంద్రులకుఁ గానీ యస్త్రవిద్యాగురుల్
నవ బాహాపటుదీర్ఘదండునకు నీ నా యొద్ద శిష్యత్వ మొ
ప్పవలెన్ శ్రీరఘురాముబాహుపటిమల్ ప్రాశస్త్యమందన్ వలెన్.
వివృతంబుల్ మునికోటియజ్ఞతతి నిర్విఘ్నత్వ మొప్పన్ వలెన్. 30

ఎవరయ్యా రఘురామచంద్రులకు అస్త్రవిద్యా గురువులు ? ఈ నవ బాహాపటుదీర్ఘదండుడైన రామచంద్రునికి నీ (వశిష్ఠుని) నా (విశ్వామిత్రుని) యొద్దనే శిష్యత్వమొప్పవలె , అప్పుడే ఈ శ్రీరఘురామచంద్రుని బాహుపటిమల్ ప్రాశస్త్యమందుతాయి, మరియు మునుల యజ్ఞములు నిర్విఘ్నంగా ప్రకాశిస్తాయి.

అంతేకాదు.
చ.
మొనసి భృశాశ్వదత్తములు మూల్గుచునున్నవి నా కడన్ మహా
స్త్ర నిభృత విద్య లట్లె రఘురామున కై యవి యెల్ల నిచ్చెదన్
మనుజమహేంద్ర ! పంపుము కుమారుని నా వెనువెంట ; నూరకే
యనలము దాచుకొన్న ఫలమా ? క్రతు యోగ్యము కావలెం జుమీ ! 31

భృశాశ్వునిచే ఈయబడిన శస్త్రాస్త్రములు ఎన్నో నా దగ్గఱ మూల్గుచూ ఉన్నాయి. వాటినన్నింటినీ రఘురాముని కై ఇచ్చెస్తాను. ఓ రాజేంద్రా ! నీ కుమారు డైన రాముడ్ని నాతో పంపించు . ఊరకే అగ్నిని దాచుకుంటే ఫలితమేంటయ్యా ? అది క్రతువునకు ఉపయోగపడితేనే దాని ఉపయోగం కాని. అన్నాడు విశ్వామిత్రుడు దశరథునితో.


0 comments

Jul 13, 2009

కక్ష్యాంతరములఁ జక్కఁగ ద్రోవ వదలుఁడా ! ద్వారపాలకుల మొత్తములవారు

అహల్యాఖండము
విశ్వామిత్రుఁడు దశరథునికడకు వచ్చుట
గీ.
అర్ఘ్య మర్ఘ్యమ్ము పాద్యమ్ము పాద్య
మవనిపతిఁ జెప్పఁబంపుడీ ! యవనిపతికిఁ
జెప్పఁబంపుడి ! ప్రభువు వశిష్ఠమునికిఁ
దెలియవలయు బ్రహ్మర్షికిఁ దెలియవలయు.

విశ్వామిత్ర మహర్షి రాకను ఎంతగా తగిన రీతిలో హడావుడిని సృష్టించి మరీ చెప్పారో చూడండి. ఒక్కొక్క పదాన్నీ రెండేసి సార్లు పలకించారు చూడండి. ఇలా చేయటం వలన చెప్పాలనుకున్నదానికి మంచి ఊపు వస్తుంది. పాఠకులకు సంభ్రమం కలుగుతుంది. కూడా కూడా వస్తాడు పాఠకుడు.
సీ.
కక్ష్యాంతరములఁ జక్కఁగ ద్రోవ వదలుఁడా !
ద్వారపాలకుల మొత్తములవారు
ఇరువంకలను బరాబరులుగా నిలువుఁడా !
చాలు లై వెండిబెత్తాలవారు
రహిని గర్పూరనీరాజనం బెత్తుఁడా !
కంకణా లులియ హెగ్గళ్ళవారు
వింజామరములు వీవుఁడా వినయమ్ము !
కందళింపగఁ గంచుకాలవారు
గీ.
ఎవరయా ? ప్రతీహారు లా యెవరొగాని
యవనినాధునకును గబురందవలయు
నింక నిచ్చటనేయుండి రేమి మీరు ?
రాజఋషి బ్రహ్మఋషి గాధిరాజసుతులు. 3
హెగ్గళ్ళవారు=అంతఃపురపు కావలివారు

ఎంత బాగుందో చూడండి. ఆ మహాఋషికి తగిన స్వాగతం పలుకుతున్నట్లుంది. ఈ ఘట్టాన్ని ఇతర రామాయణాలలో ఇంత పకడ్బందీగా నిర్వహించి ఉండలేదనుకుంటాను.
శా.
అంతర్వంశికు లిట్లుగా గుడుసులై యంతంతఁ ద్రొక్కిళ్ళుగా
నింతంతం జని సౌవిదల్లకజనుల్ హెగ్గళ్ళు దౌవారికుల్
బంతుల్ దీరిచి కొల్వఁగాఁ బనిచి భూపాలున్ బ్రబోధింపఁగా
నంతఃపత్తన మేగి తెల్పఁగ నృపుం డావిర్భవద్భక్తి యై. 4
వ.
ఒక్కనిమేషంబులోన జాబాలి కశ్యప సుయజ్ఞ వశిష్ఠులరుగుదేర దశరథబండు సపురోథసుఁడై విశ్వామిత్రున కెదురుపోయి. 5
ఎంత వేగంగా పనులు జరిగినాయో చూడండి. ఒక్క నిమేషంబులోన అందరూ కూడుకున్నారట.

1 comments

Jul 9, 2009

తానో 'లాములు' తండ్రి పేరెవరయా ? 'దాచాతమాలాలు' నౌ

శా.
తానో 'లాములు' తండ్రి పేరెవరయా ? 'దాచాతమాలాలు' నౌ
లే ! నాపే' రన 'నమ్మగాల' నఁగ నోలిందల్లి 'కౌసల్య తం
డ్రీ !' నాఁగా ననఁబోయి రాక కనులన్ నీర్వెట్టఁ 'గౌసల్య నౌఁ
గానే కానులె యమ్మనే' యని ప్రభున్ గౌసల్య ముద్దాడెడిన్. 334

కౌసల్య తన చిన్ని రామునితో ఆడుతున్నప్పుడు సంభాషణా పూర్వకంగా నడిచిన ఘట్టమిది.

కౌసల్య బాలరాముణ్ని తన పేరేమిటో చెప్పమంది. 'రాముడు' తన పేరులోని 'రా' అనే అక్షరం , 'డు' అనే అక్షరం సరిగా పలక చేతరాక 'లాములు' అని అంటాడు.

నాన్నపేరేమిటీ అని అడుగుతుంది వెంటనే, ఏం చెపుతాడో ఎలా చెపులాడో వినాలనే సహజమైన కుతూహలంతో.

'దశరథమహారాజు' అనే పదాల్ని పలక రాక 'దాచాతమాలాలు ' అంటాడు.

కొడుకు నుండి సరియైన సమాధానం వచ్చేసరికి ఇంకా రెట్టించిన ఉత్సాహంతో 'మరి నా పేరో' అంటుంది. చెప్పగలడేమో ననే ఆశతో. కాని చిన్నపిల్లలకి అమ్మ పేరుతో పనేంటి. అమ్మ అమ్మే కదా.

అందుకని 'అమ్మగారు' అనబోయి నోరు తిరక్క 'అమ్మగాల' అంటాడు. అతడ్ని సరిచేద్దామని 'కౌసల్య తండ్రీ' అని చెప్పుతుంది. కాని చిన్నపిల్లాడికి నోరు తిరగొద్దూ. అంచేత అలా అనటానికి ప్రయత్నించిన వాడై చేతకాక, చెప్పలేక పాపం కన్నులకు నీరు తెచ్చుకున్నాట్ట ఆ పసిబిడ్డడు. వెంటనే ఊరడించాలిగా ఏడవబోతున్న బిడ్డని తల్లి , అందుచేత 'కౌసల్యను కానులే', 'అమ్మనే' అంటూ బాబుని ఊరడించి మనకు ప్రభువైన ఆ శ్రీరామచంద్రులవారిని కౌసల్యాదేవి ముద్దాడిందట.
తల్లులు తమ పిల్లలతో వాళ్ళ వాళ్ళ పేర్లు చెప్పించుకొనే ఈ ఘట్టాన్ని అత్యంత రమణీయంగా సహజసుందరంగా తీర్చి దిద్దిన విశ్వనాథ వారికి ఏం చేసి ఈ జాతి తన ఋణం తీర్చుకోగలుగుతుంది ? వారి గ్రంధాలు చదివి ఆనందించడం తప్పించి.

3 comments

స్నాన మాడిన బాలెంత చక్కఁదనము

తే.
స్నాన మాడిన బాలెంత చక్కఁదనము
పరిణయమునాటి యందమ్ము పాదరించు
రాజు శిశువులఁ గాంచునో ! రాణులముఖ
దేహకాంతులు కాంచునో ! తెలియలేదు. 270
తే.
రంజితాధర తాంబూల రక్తిమంబు
చిఱునగవు తెల్లఁదనములోఁ జిటిలిపోవ
నెఱుపు విరుగుచుం దెలినిగ్గు లెక్కుచంద్ర
బింబములవోలె సతులు కన్పించినారు. 271
తే.
ఆఱుగడియలలోఁ దల్లి యనుట తెలియు
నాఱు నెలలకుఁ బైఁ దండ్రి యనుట తెలియు
ననుట నిజమే శిశువు రాజుహస్తమందు
నేడ్చి కౌసల్య చేతిలో నేడ్పు మానె. 273

0 comments

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks